“బొత్స.. మా నాన్నను తాగుబోతు అన్నాడు.. జగన్ మరిచిపోయాడా?”- అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. జగన్ ఉన్మాది అన్నారని.. ఉరేయాలని కూడా.. అన్నారని.. ఇవన్నీ.. జగన్‌కు ఇప్పుడు గుర్తులేవా? అని ప్రశ్నించారు. ఇలాంటి నీచ నేతలను పక్కన పెట్టుకుని.. వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి బలమైన వ్యక్తిత్వం ఉన్న నాయకులతో పోల్చడానికి జగన్‌కు సిగ్గుండాలని సొంత అన్నపై షర్మిల విరుచుకుపడ్డారు. బొత్సపై ప్రేమ కారుతుంటే.. వైఎస్ ఫొటోను తీసేసి.. బొత్స ఫొటో పెట్టుకోవాలని కూడా వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
సీఎం జగన్.. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా మంగళవారం.. విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అభ్యర్థులను పరిచయం చేస్తూ.. సీనియర్‌నేత, మంత్రి బొత్స సత్యనారాయణ విషయానికి వచ్చే సరికి.. బొత్సను నేను అన్నా అని అంటా. కానీ, ఆయన నాకు తండ్రి సమానులు. సౌమ్యుడు. ప్రజల పక్షపాతి. బొత్స అన్నను గెలిపించాలని పిలుపునిస్తున్నా అని జగన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకే షర్మిల తాజాగా కౌంటర్ ఇచ్చారు.
నిన్న సభలో మాట్లాడుతూ.. జగనన్న ఓ మాట అంటాడు. బొత్స సత్యనారాయణ ఆయనకు తండ్రి సమానుడంట. ఇదే నిజమైతే.. గతంలో బొత్స చేసిన కామెంట్లు ఆయనకు గుర్తులేదా? ఇదే బొత్స సత్యానారాయణగారు.. గతంలో వైఎస్సార్‌ను తాగుబోతు అని తిట్టాడు. మందు తాగకపోతే.. రాజశేఖరరెడ్డి నిద్రపోడని అన్నాడు. పోనీ.. నిన్నేమన్నా(జగన్) అనలేదా? అంటే..ఏకంగా నీకు ఉరి శిక్ష వేయాలని అన్నాడు. జగన్ మోహన్ రెడ్డి బినామీ అన్నాడు. మన తల్లి విజయమ్మను సైతం అవమాన పరిచాడు. ఇలాంటి బొత్స జగన్‌కు తండ్రి సమానుడు అయ్యాడు అని షర్మిల నిప్పులు చెరిగారు.
అంతేకాదు.. తండ్రిని తిట్టిన వాళ్లకు, తల్లిని ఈసడించిన వాళ్లకు.. జగన్ పదవులు ఇచ్చాడు. వారట.. తనకు తల్లి సమానులు, తండ్రి సమానులట. వంగా గీత ఎవరు? 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన ఆమె.. వైఎస్సార్‌ను తిట్టలేదా? నియోజకవర్గంలోకి వస్తే.. పంచెలు ఊడదీస్తామన్న మాటలు గుర్తు లేదా? ఇప్పుడు ఆమె తల్లిపోయిందా? అని షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పర్యటించిన షర్మిల.. ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates