వేలెత్తి చూపించే అవకాశం కేసీఆర్ ఇస్తున్నారా?

వేలెత్తి చూపించే అవకాశం కేసీఆర్ ఇస్తున్నారా?

మొన్నామధ్య వరకూ తెలంగాణ ముఖ్యమంత్రి తన మాటలతో ఎవరూ స్పందించే అవకాశం లేకుండా సమాధానం చెప్పేవారు. ఆయన మాటల్లోనూ.. ఆయన చెప్పే లాజిక్ లోనూ తప్పులు దొర్లేవి కావు. కానీ.. ఈ మధ్యన ఆయన వరుస తప్పులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ మధ్య వరకు తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో 90 శాతం వరకూ అమలు చేసినట్లుగా చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల విమర్శలకు అవకాశం ఉండదు. అందుకు భిన్నంగా ఈ మధ్యన నిర్వహించిన పార్టీ ప్లీనరీ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన అన్ని హామీల్ని వందశాతం పూర్తి చేసినట్లుగా పేర్కొన్నారు.

ఇలాంటి మాటలతోనే లేనిపోని విమర్శలకు తావిచ్చేలా ఉంటుంది. వందశాతం అనగానే అప్పటివరకూ ఉన్న కనుబొమ్మలు ఎక్కసారి పైకి లేవటమే కాదు.. లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తాయి. కేసీఆర్ మాట విన్న వెంటనే.. అందరికి మనసులో మెదిలేది కేజీ నుంచి పీజీ విద్య హామీ.. అదే కాదు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇష్యూ.. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు లాంటి అంశాలు చాలానే గుర్తుకు వస్తాయి. తొంభై శాతం అన్నప్పుడు వచ్చే గుర్తుకి.. వందశాతం అన్న వెంటనే వచ్చే గుర్తుకు మధ్య తేడా చాలానే ఉంటుంది.

నిజానికి కేసీఆర్ లాంటి నేత.. తనను వేలెత్తి చూపేందుకు పెద్దగా అవకాశం ఇవ్వరు. విధానాల పరంగా తనను విమర్శించటం వేరే విషయమైనా.. మాటల్లో ఆయన దొరికిపోవటం చాలా అరుదు.కానీ.. ఈ మధ్యన అలాంటివి ఎక్కువ అవుతున్నాయని చెబుతున్నారు. అమరవీరుల కుటుంబాల విషయానికే వస్తే.. తాము అధికారంలోకి వస్తే.. అమరవీరుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు.. మూడు ఎకరాల భూమి లేదంటే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పటం తెలిసిందే.
కానీ.. ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్లు గడుస్తున్నా.. రూ.10లక్షల పరిహారం మినహా మిగిలిన హామీలేమీ నెరవేరలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు.. ఉద్యమ సమయంలో వందలాదిగా యువకులు ఆత్మార్పణం చేసుకున్నట్లగా చెప్పినా.. పరిహారం ఇచ్చే సమయానికి మాత్రం కేవలం 588 మందిని మాత్రమే అమరవీరులుగా గుర్తించటం గమనార్హం. దీనిపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తటాన్ని మర్చిపోకూడదు. ఆ విషయాన్ని వదిలేస్తే.. తన మాటలతో తనను వేలెత్తి చూపించే అవకాశం కేసీఆర్ ఇవ్వకుండా ఉండాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. కేసీఆర్ అండ్ కో ఆ విషయాన్ని గుర్తిస్తే మంచిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు