ఏపీ సీఎం బాబుకు ఆర్కే 'తాజా వార్నింగ్‌'?

ఏపీ సీఎం బాబుకు ఆర్కే 'తాజా వార్నింగ్‌'?

ఆర్కేగా సుపరిచితుడైన ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ కొన్ని విషయాల్ని కుండబద్ధలు కొట్టటంలో అస్సలు వెనుకాడరు. మీడియాలో కొన్ని విషయాల మీద చర్చ అనేది జరగకుండా అప్రకటిత సెన్సార్‌ సాగిస్తుంటారు. అదేమంటే.. ఆయా వర్గాల మనోభావాలు దెబ్బ తీయటం సరికాదన్న పెద్దరికపు మాటలు చెప్పేసి.. సమాజంలో వస్తున్న వెర్రిపోకడల్ని వివరించే ప్రయత్నం చేయకుండా ఉండిపోతారు. ఇలాంటి వైఖరిని ప్రదర్శించే పెద్ద మీడియా సంస్థలు చాలానే ఉంటాయి. కానీ.. రాధాకృష్ణ మాత్రం అందుకు భిన్నం.

ఈ మధ్యన కొన్ని కార్యక్రమాల్లో భాగంగా ఏపీలోని కొన్ని ప్రాంతాలకు ఆయన వెళ్లాల్సి వచ్చింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి.. ఆంధ్రా ప్రాంతానికి వెళితే కొన్ని విషయాలు చాలా చిత్రంగా అనిపిస్తాయి. ఇక.. జర్నలిస్ట్‌ కోణంలో చూస్తే మరింత ఆసక్తిగా అనిపించక మానదు. జర్నలిస్ట్‌ గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి.. చివరకు తాను పని చేసిన పత్రికకే యజమాని అయిన అరుదైన రికార్డు రాధాకృష్ణ సొంతం. అలాంటి వ్యక్తి దృష్టికోణంలో ఏపీ కుల వ్యవహారం రాజకీయాల్ని ఎలా దెబ్బ తీసిందన్న విషయాన్ని విశ్లేషిస్తే ఆసక్తికరంగా ఉంటుంది.

తాజాగా ఏపీకి వెళ్లిన రాధాకృష్ణ.. తన వారాంతపు రాజకీయ విశ్లేషణ వ్యాసం ద్వారా ఏపీలోని కులాభిమానం హద్దులు దాటి ఓవరాక్షన్‌ చేసిన యూత్‌ కారణంగా దెబ్బతిన్న అధినేతల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ నిజాలన్నీ అందరికి తెలుసు. కానీ.. ఎవరూ మీడియా పరంగా మాట్లాడింది లేదు. కానీ.. అందుకు భిన్నంగా రాధాకృష్ణ మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా విషయాల్ని చెప్పేయటమే కాదు.. ఏపీ అధికారపక్షానికి వార్నింగ్‌ లాంటిది ఇచ్చేశారు.

ఏపీలో కులాభిమానం చాలా ఎక్కువ. అందునా గోదావరి జిల్లాలతో పాటు.. కృష్ణా.. గుంటూరు జిల్లాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. కులాల వారీగా రాజకీయాల్నిచూసే అక్కడి యూత్‌ తమకు తెలీకుండా రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేస్తుంటారు. ఇలాంటి వైఖరి వల్ల కలిగే నష్టాన్ని ఆర్కే తన మాటలతో సూటిగా చెప్పేశారు. అంతేకాదు.. అలాంటి తప్పే జరిగితే ఏపీ అధికార పక్షానికి కలిగే నష్టం గురించి బాబుకు వార్నింగ్‌ ఇచ్చినంత పని చేశారు.

మరి..ఆర్కే చెప్పిన మాటల్ని ఆయన మాటల్లోనే చెబితే.. '''చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత అప్పట్లో గ్రామాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన యువత ఓవర్‌ యాక్షన్‌ కారణంగా మిగితా వర్గాల వారు చిరంజీవికి దూరమయ్యారు. గత ఎన్నికల్లో క్రిస్టియన్‌ దళితుల ఓవర్‌ యాక్షన్‌ కారణంగా కోస్తా జిల్లాల్లో మిగతా కులాల వారు వైసీపీకి దూరమయ్యారు. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు గ్రామాలలో ఓవర్‌ యాక్షన్‌ చేస్తే వచ్చే ఎన్నికల నాటికి మిగతా వర్గాలు టీడీపీకి దూరమవుతాయి. ఈ పరిణామాలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న కుల వైషమ్యాలను ఆదిలోనే అరికట్టటానికి గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంది.

లేనిపక్షంలో రాజకీయంగా ఆయన పార్టీకి నష్టం జరగటమే కాకుండా.. ఆ రాష్ట్రానికీ తీరని నష్టం జరుగుతుంది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న కుల వైషమ్యాలను నివారించటానికి గట్టి చర్యలు తీసుకోనిపక్షంలో విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ఫలితాలు అందటం అటుంచి రాష్ట్రం తిరోగమనంలోకి వెళుతుంది'' అంటూ ఆర్కే ఓ రేంజ్‌ లో వార్నింగ్‌ ఇచ్చేశారు. మరి.. దీన్ని బాబు ఎంత సీరియస్‌ గా తీసుకుంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు