సినిమాల్లో నటించి లేదా సోషల్ మీడియాల్లో వీడియోలతో ఎంతోమంది పాపులర్ అయ్యారు. ఇంకా అవుతూనే ఉన్నారు. వీళ్లకు భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉంటున్నారు. వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. కానీ ఆ అభిమానం ఓట్లుగా మారుతుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. గతంలో ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయాల్లో ఫెయిల్ అవడమే అందుకు నిదర్శనం. ఇప్పుడు హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కానీ అది ఓట్లుగా మారుతుందా అంటే సందేహమే.
నిజానికి కొంపెల్ల మాధవీలత కొద్ది రోజుల క్రితం వరకూ జనాలకు పెద్దగా తెలియదు. విరంచి ఆసుపత్రి అధినేత సతీమణీ అయినప్పటికీ, భరత నాట్య కళాకారిణిగా గుర్తింపు పొందినా సాధారణ ప్రజలకు ఆమె ఎవరో తెలియదు. పాతబస్తీలో ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించినా పెద్దగా ఆదరణకు నోచుకోలేదనే అభిప్రాయాలున్నాయి. కానీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీగా మాధవీలతకు బీజేపీ టికెట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆమె ఎవరనేది చర్చనీయాంశమైంది. ఆహార్యంలోనూ, భావంలోనూ హిందుత్వాన్ని కనబరుస్తున్న ఆమెకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వ్యూస్ బాగానే వస్తున్నాయి. కానీ ఆ వ్యూస్కు తగ్గ ఓట్లు వస్తాయా అన్నదే ప్రశ్న.
హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అంటే ఎంఐఎం కోట. 1984 నుంచి 2004 వరకు సుల్తాన్ సలావుద్దీన్ ఇక్కడ ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆయన తనయుడు అసదుద్దీన్ వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ ఎంపీగా విజయదుందుభి మోగించారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఆ పార్టీని ఓడించడం దాదాపు అసాధ్యమనే అభిప్రాయాలున్నాయి. కానీ పాతబస్తీలోనే పుట్టిన మాధవీలత కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఓటర్ల మనసు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ అసదుద్దీన్ను ఓడిస్తే మాత్రం ఆమె పేరు చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates