ఒకటి, రెండు, మూడు.. ఇలా నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ర్యాంకుల పంట పండిస్తారు. ఇప్పుడు ఇలాగే తాను కూడా పొలిటికల్ ఎగ్జామ్‌లో ఫస్ట్ రావాలని నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓడిన నారాయణ.. ఈ సారి మాత్రం టీడీపీ తరపున జయకేతనం ఎగురవేయాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్లుగా పక్కా ప్రణాళికతో సాగిపోతున్నారు.
2014 ఎన్నికల్లో నారాయణ పోటీ చేయలేదు. కానీ అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఎమ్మెల్సీ అయిన నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఎదిగారు. 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష పోరుకు దిగారు. కానీ వైసీపీ నాయకుడు అనిల్‌కుమార్ యాదవ్ చేతిలో సుమారు మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. విజయం కోసం ఆయన ఎంతో గట్టిగా ప్రయత్నించినా స్వల్ప తేడాతో పరాజయం తప్పలేదు. అందుకే గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లను తెలుసుకుని ఇప్పుడు వాటిని సరిదిద్దుకుంటూ సాగుతున్నారు.
నెల్లూరు సిటీలో నారాయణ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో తన సన్నిహితులు, సొంత పార్టీలోని కొంతమంది నేతలు తనను మోసం చేశారని నారాయణ భావించినట్లు తెలిసింది. తను పేరు ప్రజలకు చేరకుండా వీళ్లు అడ్డుకున్నారని ఆయన అనుకుంటున్నారు. అందుకే ఈ సారి స్థానిక టీడీపీ నేతలను పక్కన పెట్టుకున్నప్పటికీ పూర్తి స్థాయి బాధ్యతలను మాత్రం అప్పగించలేదని తెలిసింది. అందుకు తన సొంత సైన్యాన్ని బరిలో దించారని సమాచారం. తన సొంత మనుషులుగా భావించే నారాయణ పాఠశాలలు, కళాశాలల సిబ్బందిని నారాయణ రంగంలోకి దించారని టాక్. నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి సూపర్ సిక్స్ హామీలను జనాలకు చేర్చే బాధ్యతలను వీళ్లకు నారాయణ అప్పగించినట్లు తెలిసింది.