ఫ్యాబ్-4లో అట్టుడుగుకు నాగ్

ఫ్యాబ్-4లో అట్టుడుగుకు నాగ్

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు ‘ఆ నలుగురు’ అనే మాట కొందరు నిర్మాతల్ని ఉద్దేశించిన నెగెటివ్‌గా ఉపయోగిస్తున్నారు కానీ.. ఒకప్పుడైతే తెలుగు సినీ పరిశ్రమను ఏలిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల గురించి ఈ మాట వాడేవారు. ఇంకా చెప్పాలంటే భారత క్రికెట్ జట్టులో అత్యంత కీలకంగా ఉంటూ ఫ్యాబ్-4గా పేరు తెచ్చుకున్న సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్‌లతో వీళ్లను పోల్చవచ్చు. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో తిరుగులేని హవా సాగించారు ఈ నలుగురూ.

ఐతే తర్వాతి తరంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వాళ్ల రాకతో ఈ నలుగురి ప్రాధాన్యం తగ్గింది. చిరు సినిమాలకే దూరమయ్యాడు. మిగతా ముగ్గురూ యువ కథానాయకుల జోరు ముందు నిలవలేకపోయారు. ఐతే ఒక దశలో ఉనికిని కోల్పోయేలా కనిపించిన ఈ నలుగురూ కూడా వేర్వేరు సమయాల్లో బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్లీ తమ సత్తా చాటుకున్నారు.

ఐతే రేంజ్ పరంగా చూస్తే మెగాస్టార్‌ను మిగతా ముగ్గురూ ఎప్పుడూ అందుకున్నది లేదు. రెండో స్థానం విషయంలో ముగ్గురి మధ్య పోటీ ఉండేది. ఒకసారి బాలయ్య ఆ స్థానంలో ఉంటే.. ఇంకోసారి నాగార్జున వచ్చేవాడు. అప్పుడప్పుడూ వెంకీ ఆ స్థానానికి చేరేవాడు. గత దశాబ్ద కాలంలో వీళ్ల కెరీర్లను పరిశీలిస్తే చాలా వరకు వెంకీనే అట్టడుగున ఉండేవాడు. ఆయన రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ అంతకంతకూ పడిపోతూ వచ్చింది. నాగ్, బాలయ్యల మధ్య పోరు హోరాహోరీగా ఉండేది. సక్సెస్ రేట్, వసూళ్ల పరంగా చూస్తే కొన్నేళ్ల ముందు నాగార్జునే మిగతా వాళ్ల కంటే పైనుండేవాడు.

కానీ ఈ మధ్య పరిస్థితి మారిపోయింది. వరుస ఫ్లాపులతో నాగ్ రేంజ్ అంతకంతకూ పడిపోతూ వచ్చింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’తో ఒక దశలో పీక్స్‌ను అందుకున్న నాగ్.. ఆపై వరుసగా ఆరు ఫ్లాపులతో రేసులో బాగా వెనుకబడిపోయాడు. మరోవైపు చిరు ఎలాగూ తన స్థాయి ఏంటో ‘ఖైదీ నంబర్ 150’తోనే చూపించాడు. ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి మెగా ప్రాజెక్టు చేస్తున్నాడు. బాలయ్య ‘యన్.టి.ఆర్’తో దెబ్బ తిన్నా.. అంతకుముందు ‘జై సింహా’తో పర్వాలేదనిపించాడు. వెంకీ ఏమో ‘ఎఫ్-2’తో ఊహించని విజయాన్నందుకున్నాడు. ఎటొచ్చీ నాగ్ పరిస్థితే దయనీయంగా ఉంది. ఇప్పుడు ఫ్యాబ్-4లో అట్టడుగు స్థానం అక్కినేని హీరోదే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English