ఈ సారి ఆంధప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా జట్టుకట్టాయి. అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా సాగుతున్నాయి. టీడీపీ, జనసేన నాయకులతో పాటు బీజేపీ నేతలు కూడా వైసీపీది అరాచక పాలన అంటూ జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. ఇందులో బీజేపీ నేతలు కూడా తగ్గడం లేదు. కానీ జగన్ మాత్రం బీజేపీ శత్రువుగా మారిన సరే ఆ పార్టీని మాత్రం పట్టుకుని వదలడం లేదని టాక్.
జగన్‌తో అవసరం లేదని భావించే టీడీపీ, జనసేనతో బీజేపీ చేరింది. కానీ జగన్ మాత్రం బీజేపీ కటాక్షం కోసం చూస్తూనే ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో సమావేశంలో కేంద్రంలో ఎన్డీయేకు పూర్తి మెజారిటీ రాకపోతే తాను మద్దతిస్తానని జగన్ చెప్పారని తెలిసింది. ఇక్కడ రాష్ట్రంలో తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి.. కేంద్రంలో సపోర్ట్ చేస్తానని జగన్ చెప్పడం ఏమిటో విడ్డూరంగా ఉందని అందరూ అనుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఎన్డీయేకు మాత్రం జగన్ మద్దతు ఉంటుందంటున్నారు.
కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనవసరంగా బీజేపీతో తగవు పెట్టుకోవడం ఎందుకు అని జగన్ అనుకుంటున్నారని తెలిసింది. కాదని బీజేపీని ఎదిరిస్తే పెండింగ్‌లో ఉన్న అక్రమాస్తుల కేసులో జగన్ మరోసారి జైలుకు వెళ్లడం ఖాయమన్నది విశ్లేషకుల అంచనా. ఈ విషయం జగన్‌కు తెలియంది కాదు. అందుకే ఏది ఏమైనా బీజేపీని మాత్రం ఆయన వదలడం లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఏపీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేనపై విరుచుకుపడుతున్న జగన్ అండ్ కో బీజేపీ జోలికి మాత్రం వెళ్లడం లేదు. జగన్ అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా తదితర రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం మెడలు వంచుతా లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ తన స్వార్థం కోసం, కేసుల నుంచి రక్షణ కోసం ఆ తర్వాత ప్రత్యేక హోదా విషయమే మర్చిపోయారనే విమర్శలున్నాయి.