రీమేక్ ఓకే.. కానీ అతను సెట్టవుతాడా?

రీమేక్ ఓకే.. కానీ అతను సెట్టవుతాడా?

గత దశాబ్ద కాలంలో తెలుగులోకి వచ్చిన రీమేక్‌ల ఫలితాలు పరిశీలిస్తే.. సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉన్న విషయం అర్థమవుతుంది. ఈ రోజుల్లో జనాలు ఏ భాషలో సినిమా హిట్టయినా వెంటనే చూసేస్తుండటంతో రీమేక్‌లకు క్రేజ్ తగ్గిపోయింది. పైగా ఒక భాషలో బాగా ఆడినంత మాత్రాన అదే కథ ఇంకో భాషలో ఆకట్టుకుంటుందన్న గ్యారెంటీ ఉండట్లేదు.

అయినప్పటికీ మన ఫిలిం మేకర్స్ రీమేక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో ‘96’.. ‘రాక్షసన్’.. ‘తెరి’ లాంటి తమిళ హిట్లను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇంకో తమిళ హిట్ మూవీకి తెలుగు రీమేక్ కన్ఫమ్ అయింది. ఆ చిత్రమే.. తడమ్. ‘బ్రూస్ లీ’లో విలన్ పాత్ర చేసిన అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మగిల్ తిరుమణి దర్శకత్వం వహించాడు. ఇందులో అరుణ్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం.

మార్చి 1న విడుదలైన ‘తడమ్’ అదిరిపోయే టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఆ సినిమా బడ్జెట్ స్థాయికి చూసుకుంటే అది బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. తమిళంలో ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటిగా దీన్ని చెబుతున్నారు. సినిమా విడుదలైన రెండో రోజు నుంచే దీని రీమేక్ కోసం టాలీవుడ్ నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి. గట్టి పోటీ నెలకొనగా.. స్రవంతి రవికిషోర్, ఠాగూర్ మధు కలిసి హక్కులు తీసుకున్నట్లు వెల్లడైంది. రవికిషోర్ ఎంటరయ్యాడంటే.. ఈ సినిమా రామ్ చేయడానికి ఆస్కారమున్నట్లే. ఐతే పీఆర్వోలు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించట్లేదు. రామ్ ఈ సినిమా చూశాక.. ఓకే అనుకుంటే అతనే నటిస్తాడని.. లేదంటే వేరే హీరోతో సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇలా సందేహం వ్యక్తం చేయడానికి ఈ సినిమా రామ్‌కు సెట్టవ్వదన్న ఆలోచనే కారణం.

‘తడమ్’ సీరియస్ థ్రిల్లర్. అరుణ్ మామూలుగానే గట్టిగా, రఫ్‌గా ఉంటాడు. సినిమా కోసం ఇంకా బలంగా తయారయ్యాడు. సినిమాలో ఒక క్యారెక్టర్లో నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. రామ్ చూస్తే సాఫ్ట్‌గా కనిపిస్తాడు. నెగెటివ్ షేడ్స్ చూపించడం కష్టం. పైగా బాడీకి, బాడీ లాంగ్వేజ్‌కి ఇలాంటి ఇంటెెన్స్ థ్రిల్లర్లు సెట్ కావు. కాబట్టి ఈ సినిమా మరో హీరో చేతికి వెళ్లే అవకాశాలే ఎక్కువ.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English