తన సినిమాను తనే కామెడీ చేసుకున్నాడే..

తన సినిమాను తనే కామెడీ చేసుకున్నాడే..

అక్కినేని వారసత్వాన్నందుకుని తెరంగేట్రం చేసిన సుశాంత్.. సొంత బేనర్లో వరుసగా నాలుగు సినిమాలు చేసి ఎదురు దెబ్బలు తిన్నాడు. చివరగా బయటి బేనర్లో గత ఏడాది ‘చి ల సౌ’ అనే చిన్న సినిమా చేస్తే అది ఓ మోస్తరుగా ఆడింది. కమర్షియల్‌గా మరీ పెద్ద సక్సెస్ కాకపోయినా మంచి సినిమాగా పేరు తెచ్చుకోవడం.. నటుడిగా సుశాంత్‌కు కూడా కొంచెం గుర్తింపు తేవడం సానుకూలమైన విషయాలు. ఈ చిత్రంతో ప్రేక్షకుల్లో కొంచెం పాజిటివిటీ తెచ్చుకున్నాడు సుశాంత్. ఐతే ఈ సినిమాకు ముందు అతడి మీద చాలా నెగెటివిటీ ఉండేది. సోషల్ మీడియాలో సుశాంత్‌ను బాగానే ట్రోల్ చేసేవాళ్లు. ఆ క్రమంలోనే అతను హీరోగా ‘గట్టిగా కొడతా’ అనే సినిమా తెరకెక్కబోతోందంటూ ఒక ఫేక్ పోస్టర్ తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం గుర్తుండే ఉంటుంది.

ఐతే ఈ విషయాన్ని స్పోర్టివ్‌గా తీసుకున్న సుశాంత్.. తన మీద తనే జోకులు వేసుకున్నాడు. ‘చి ల సౌ’ ప్రమోషన్లకు కూడా ఈ ఐడియాను వాడుకున్నాడు. ఐతే అప్పుడు చూపించిన సెన్సాఫ్ హ్యూమర్‌నే ఇప్పుడు మరోసారి చూపించాడు సుశాంత్. సుశాంత్ అంతకుముందు చేసిన వాటిలో అతి పెద్ద ఫ్లాపుగా నిలిచిన ‘ఆటాడుకుందాం’ సినిమాను హిందీలో డబ్ చేసి ‘మేరా ఇంతేకామ్’ పేరుతో యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు దీని ప్రీమియర్ అంటూ పోస్టర్ కూడా వేశారు. ప్రోమో కూడా వదిలారు. ఆ ప్రోమో లింక్ షేర్ చేసి ‘బ్లాస్ట్ ఫ్రమ్ ద పాస్ట్’ అంటూ క్యాప్షన్ జోడించి ఫన్నీ ఇమోజీలతో ట్వీట్ చేశాడు సుశాంత్. తన సినిమా గురించి తనే ఇలా కామెడీ చేసుకుంటూ ట్వీట్ పెట్టడం చూసి జనాలు కూడా కొంచెం కామెడీ చేశారు. ఆ కామెంట్లను కూడా సుశాంత్ స్పోర్టివ్‌గానే తీసుకున్నట్లున్నాడు. ఈ మధ్య తెలుగులో రిలీజయ్యే ఓ మోస్తరు సినిమా ప్రతిదీ హిందీలోకి డబ్ అయి యూట్యూబ్‌లో, హిందీ టీవీ ఛానెళ్లలో అదరగొట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే సుశాంత్ సినిమా సైతం హిందీలోకి డబ్ అయినట్లుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English