‘పెళ్లిచూపులు’ దర్శకుడికి అన్యాయం

‘పెళ్లిచూపులు’ దర్శకుడికి అన్యాయం

ఒక భాషలో హిట్టయిన సినిమాను మరో భాషలోకి రీమేక్ చేస్తే.. కచ్చితంగా కథ తాలూకు క్రెడిట్ ఒరిజినల్ రైటర్‌కే ఇవ్వాలి. నిజానికి సినిమాను ఉన్నదున్నట్లు తీసేస్తున్నపుడు స్క్రీన్ ప్లే క్రెడిట్ కూడా ఒరిజినల్ రైటర్‌కే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలామంది అలా చేయరు. ఐతే కథ క్రెడిట్ మాత్రం కచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ దక్షిణాదిన సూపర్ హిట్టయిన సినిమాల్ని ఎలా పడితే అలా మార్చి తీసేసే బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఇక్కడి వాళ్లకు క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడరు. రీమేక్  హక్కులు తీసుకున్నాక కథ తాలూకు క్రెడిట్ ఇవ్వాలన్న క్లాజ్ ఉంటుందో లేదో కానీ.. అలా చేయడం నైతికతను చాటుకుంటుంది. కానీ బాలీవుడ్ జనాలు ఇలా ఆలోచించరు. తాజాగా ‘పెళ్ళిచూపులు’ రీమేక్ విషయంలోనూ ఇలాగే జరిగింది.

రెండేళ్ల కిందట తెలుగులో విడుదలై ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని ‘మిత్రో’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే రిలీజైంది. అది చూస్తే ‘పెళ్ళిచూపులు’ రీమేక్ అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఒరిజినల్లోని పాత్రలు.. సన్నివేశాలు అలాగే అందులో కనిపిస్తున్నాయి. కానీ ట్రైలర్ అయ్యాక కనిపించే క్రెడిట్స్‌లో ఎక్కడా ఒరిజినల్ రైటర్ కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పేరు లేదు. రైటర్‌గా షరిబ్ హస్మి పేరు వేశారు. కనీసం మూల కథ అని కూడా తరుణ్ పేరు వేయలేదు. మరి ఇదేం చిత్రమో మరి. ఈ సినిమాను నితిన్ కక్కర్ డైరెక్ట్ చేశాడు. జాకీ భగ్నాని.. కృతిక కమ్రా ఈ చిత్రంలో జంటగా నటించారు. వాళ్లిద్దరూ విజయ్ దేవరకొండ-రీతూ వర్మలను మ్యాచ్ చేయలేదనే చెప్పాలి. వచ్చే నెలలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సినిమా టైటల్స్‌లో అయినా తరుణ్ పేరు ప్రస్తావనకు వస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు