అభిమానులూ.. మహేష్ ఏమన్నాడో విన్నారా?

అభిమానులూ.. మహేష్ ఏమన్నాడో విన్నారా?

‘‘మేము మేము బాగానే ఉంటాం. మీరు మీరు ఇంకా బాగుండాలి’’.. భరత్ అనే నేను ప్రి రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు అన్న మాటలివి. అంతే కాదు.. ఇండస్ట్రీలో ఉండేదే ఐదారుగురు పెద్ద హీరోలని.. వాళ్లు ఏడాదికి చేసేది ఒక్క సినిమా అని.. ఆ సినిమాను అందరు హీరోల అభిమానలు కలిసి చూస్తే మంచి విజయం సాధిస్తుందని.. ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని అన్నాడు మహేష్. ఈ మాటల ఆంతర్యమేంటో అందరికీ అర్థమయ్యే ఉంటుంది.

ఒక స్టార్ హీరో అభిమానులు.. మరో స్టార్ హీరో సినిమా విడుదలైతే దానిపై విపరీతమైన వ్యతిరేక ప్రచారం జరగడం.. అవతలి హీరోను, అతడి అభిమానుల్ని తిట్టిపోయడం లాంటి పరిణామాలు సోషల్ మీడియాలో బాగా నడుస్తున్నాయి. మహేష్ ఇలాటి వాటి వల్ల బాగానే ఇబ్బంది పడ్డాడు. ‘బ్రహ్మోత్సవం’.. ‘స్పైడర్’ సినిమాలపై ఈ యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ ప్రచారం గట్టిగానే పని చేసింది.

ఈ నేపథ్యంలోనే ఇలాంటివి కట్టిపెట్టాలని అభిమానుల్ని పరోక్షంగా హెచ్చరించాడు మహేష్. ఇలాంటి వ్యవహారాల్లో మహేష్ అభిమానులకు కూడా పాత్ర ఉంది కాబట్టే అందరూ మారాలని మహేష్ పిలుపునిచ్చాడు. ఎన్టీఆర్‌ను ‘భరత్ అనే నేను’ వేడుకకు ముఖ్య అతిథిగా ఆహ్వనించడం.. ఇటీవలే ఫారిన్ నుంచి రాగానే ‘రంగస్థలం’ చూసి దాని గురించి పాజిటివ్‌గా స్పందించడం.. ‘భరత్ అనే నేను’ వేడుక ముగిశాక పార్టీలో చరణ్‌ను కలవడం.. ఇవన్నీ అభిమానుల మధ్య అంతరాల్ని తొలగించడం కోసమే.

ఈ వేడుకలో కొరటాల శివ సైతం అభిమానులకు గట్టి సందేశమే ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘నేను హీరోల్ని మీకంటే ఎక్కువగా ఇష్టపడతా. కానీ అందరితోనూ మంచి బంధం ఉంది. మహేష్, ఎన్టీఆర్ అభిమానులు ఇలా కలిసి ఉంటే నా ట్రైలర్ ఈ విజువలే బాగుంది’’ అనడం ద్వారా అభిమానులు గొడవలు కట్టిపెట్టి కలిసికట్టుగా ఉండాలని చెప్పకనే చెప్పాడు కొరటాల. మొత్తానికి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్‌కు తెరదించాలనే విషయంలో మహేష్ గట్టిగానే ఆలోచించినట్లు తెలుస్తోంది.