‘ఆక్సిజన్’ రీమేక్.. అక్షయ్.. అజయ్.. శివరాజ్

‘ఆక్సిజన్’ రీమేక్.. అక్షయ్.. అజయ్.. శివరాజ్

చిత్రీకరణ మొదలైన రెండేళ్ల తర్వాత పూర్తయి.. రిలీజ్ విషయంలో కూడా నాలుగైదు డేట్లు మార్చుకుని.. ఎట్టకేలకు ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది గోపీచంద్ సినిమా ‘ఆక్సిజన్’. ఐతే గోపీచంద్ అభిమానుల నిరీక్షణకు ఫలితం దక్కలేదు. ఈ సినిమాకు పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది.

ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నామని ప్రి రిలీజ్ ప్రమోషన్లలో దర్శకుడు జ్యోతికృష్ణ చెప్పిన మాటలు ఇప్పుడు కామెడీ అయిపోయాయి. ఇలాంటి సినిమాను రీమేక్ చేస్తున్నారా అని సినిమా చూసిన వాళ్లు ఆశ్చర్యపోయారు. ఐతే రిలీజ్ తర్వాత నిర్మాత ఎ.ఎం.రత్నం కూడా ఇదే మాట చెబుతున్నాడు.

కేవలం తమిళం మాత్రమే కాదు.. కన్నడ, హిందీ భాషల్లోనూ ‘ఆక్సిజన్’ను రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఆయన చెప్పడం విశేషం. హిందీలో అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగణ్‌లకు ఈ కథ చెప్పి వాళ్లిద్దరిలో ఎవరో ఒకరితో సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందని తన మిత్రుడు సలహా ఇచ్చాడని.. ఆ దిశగా ఆలోచిస్తున్నానని రత్నం చెప్పాడు.

మరోవైపు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌కు త్వరలోనే ఈ కథ చెప్పనున్నట్లు రత్నం తెలిపాడు. ‘ఆక్సిజన్’ సినిమాకు తొలి రోజు ఆశించిన స్పందన లేదని.. రెండో రోజు నుంచి వసూళ్లు పుంజుకున్నాయని రత్నం చెప్పాడు. ఐతే రివ్యూల వల్ల సినిమా చచ్చిపోతోందని.. సినిమా విడుదలైన మూడు రోజుల వరకు రివ్యూలు ఇవ్వకుంటే బాగుంటుందని.. ఇది తన రిక్వెస్ట్ అని రత్నం అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు