చైతూ తొందరపడిపోయాడే..

చైతూ తొందరపడిపోయాడే..

కొన్ని కథలు విన్నాక ఎగ్జైట్మెంట్ ఆపుకోవడం కష్టం. ఆ కథల్ని ఎవరితో ఒకరితో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఐతే ఇండస్ట్రీలోని సన్నిహితులకు స్టోరీ రివీల్ చేస్తే ఓకే కానీ.. మీడియా దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ అక్కినేని చైతన్య మీడియా ముందు కూడా ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోయాడు. ‘కార్తికేయ’, ‘ప్రేమమ్’ చిత్రాల దర్శకుడు చందూ మొండేటితో తాను చేయబోయే ‘సవ్యసాచి’ కాన్సెప్ట్ ఏంటో రివీల్ చేసేశాడు. ఈ చిత్రానికి ‘సవ్యసాచి’ అనే టైటిల్ ఎందుకు పెట్టారో.. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో ‘యుద్ధం శరణం’ ప్రమోషన్లలో భాగంగా మీడియాకు వివరించాడు చైతూ.

‘సవ్యసాచి’లో కథానాయకుడికి ఓ విచిత్రమైన లక్షణం ఉంటుందట. అతడి ఎడమచేయి అతడి మాట వినదట. దానికి, అతడి బ్రెయిన్‌కు కనెక్షనే ఉండదట. వేరొకరి చేయి లాగా అది తన పని తాను చేసుకుపోతుంటుందట. దాని వల్ల కథానాయకుడికి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయట. కుడి చేయికి ఉండే శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు ఎడమ చేతికి కూడా ఉంటాయట.

ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి ‘సవ్యసాచి’ అనే టైటిల్ పెట్టినట్లు చైతూ వెల్లడించాడు. ఈ కాన్సెప్ట్ తనను ఎంతో ఎగ్జైట్ చేసిందని, ఈ సినిమా ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఎదురు చూస్తున్నానని చైతూ తెలిపాడు. ఐతే ఇలాంటి కాన్సెప్ట్స్‌ను సినిమా రిలీజ్ దగ్గర పడే వరకు కొంచెం దాచి ఉంచి.. టీజర్లోనో, ట్రైలర్లోనో రివీల్ చేస్తే బాగుంటుంది.

అలా కాకుండా సినిమా మొదలుకాకముందే రివీల్ చేసేయడం వల్ల ఒకట్రెండు రోజులు చర్చించుకుంటారు. వదిలేస్తారు. తర్వాత క్యూరియాసిటీ పోతుంది. ఇది దర్శకుడిని నిరాశకు గురిచేసి ఉండొచ్చు. చూస్తుంటే చైతూ ఏదో ఎగ్జైట్మెంట్లో టంగ్ స్లిప్ అయినట్లున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు