అద్భుతమైన కథ రెడీ అంటున్న వంశీ

అద్భుతమైన కథ రెడీ అంటున్న వంశీ

కొన్నాళ్ల కిందటి వరకు సీనియర్ దర్శకుడు వంశీ గురించి జనాలకు పట్టింపే ఉండేది కాదు. ఆయన దర్శకత్వంలో చివరగా వచ్చిన ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ సినిమా విడుదలైన సంగతి కూడా జనాలకు తెలియదు. అంతకుముందు వంశీ తీసిన సినిమా సంగతీ ఇంతే.

వంశీ సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ తర్వాత వచ్చిన సినిమాలేవీ కూడా ఆడలేదు. ఐతే వంశీ కొత్త సినిమా ‘ఫ్యాషన్ డిజైనర్’ మాత్రం ఓ మోస్తరుగా క్రేజ్ సంపాదించుకుంది. తన సినిమాల్ని మార్కెట్ చేసుకోవడంలో నేర్పరి అయిన నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి.. ‘ఫ్యాషన్ డిజైనర్’ను జనాల్లోకి తీసుకెళ్లగలిగారు. ఈ శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తన కొత్త సినిమా మీద చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు వంశీ. నిర్మాత మధుర శ్రీధర్.. ఔట్ పుట్ చూసి చాలా హ్యాపీ అని.. ఫలితం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్ర పొమ్మని చెప్పారని వంశీ అన్నాడు. ఈ ఉత్సాహంలో తన కొత్త ప్రాజెక్టుల గురించి వంశీ వివరించాడు. తెలుగు సినీ చరిత్రలో ఇప్పటిదాకా రాని ఒక అద్భుతమైన కథ రెడీ చేస్తున్నట్లుగా వంశీ చెప్పాడు.
తన తర్వాతి సినిమా అదే అవుతుందని.. ఆ కథ కచ్చితంగా సంచలనం అవుతుందని వంశీ తెలిపాడు. దీంతో పాటు ‘అన్వేషణ’ తరహా థ్రిల్లర్ చేసే ఉద్దేశమున్నట్లు వంశీ తెలిపాడు.

కొన్నాళ్ల కిందట రామ్ గోపాల్ వర్మ కలిసి ‘అన్వేషణ-2’ తీయమని తనకు చెప్పాడని.. ఐతే అలా కాకుండా ఆ తరహాలోనే ఒక థ్రిల్లర్ సినిమా చేయడానికి స్క్రిప్టు సిద్ధం చేస్తున్నట్లు వంశీ తెలిపాడు. మొత్తానికి ‘ఫ్యాషన్ డిజైనర్’ తీశాక వంశీలో మళ్లీ ఒక ఉత్సాహం కనిపిస్తోంది. ఈ సినిమా బాగా ఆడితే.. వంశీని ఇంకా కొన్నేళ్లు దర్శకుడిగా చూడొచ్చేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు