‘రోబో’ తర్వాత మళ్లీ మురుగదాస్‌తో

‘రోబో’ తర్వాత మళ్లీ మురుగదాస్‌తో

తమిళనాటే కాదు.. ఇండియాలోనే అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో సన్ పిక్చర్స్ ఒకటి. వంద కోట్ల బడ్జెట్ పెట్టి బాలీవుడ్ వాళ్లే సినిమాలు తీయడానికి సందేహించే రోజుల్లో ఏకంగా రూ.150 కోట్లు పెట్టి ‘రోబో’ సినిమా తీసిన ఘనత సన్ పిక్చర్స్ వాళ్లదే. ఐతే అనుకోకుండా ఆ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది.

డీఎంకే పార్టీ తమిళనాట అధికారం కోల్పోగానే మారన్ కుటుంబం ఇబ్బందుల్లో పడిపోయింది. ఆర్థికంగా బాగా దెబ్బ తింది. దీంతో సినిమాల గురించి ఆలోచించే అవకాశం లేకపోయింది. అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే.. ‘రోబో’ సీక్వెల్ ‘2.0’ కూడా ఆ సంస్థలోనే తెరకెక్కాల్సింది. కానీ శంకర్ ఈ సినిమా మొదలుపెట్టాలనుకునే సమయానికి రూ.400 కోట్ల బడ్జెట్ పెట్టే స్థితిలో సన్ పిక్చర్స్ లేదు. దీంతో లైకా ప్రొడక్షన్స్ వాళ్లు ఆ ప్రాజెక్టును టేకప్ చేశారు.

ఐతే ‘రోబో’ తర్వాత సినీ నిర్మాణానికి దూరంగా ఉన్న సన్ పిక్చర్స్ మళ్లీ ఎట్టకేలకు సినిమా నిర్మించడానికి రంగం సిద్ధం చేసింది. ‘రోబో’ స్థాయిలో కాకున్నా.. రీఎంట్రీకి ఓ భారీ ప్రాజెక్టునే ఎంచుకుంది సన్ పిక్చర్స్. మురుగదాస్-విజయ్ కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ‘తుపాకి’, ‘కత్తి’ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత విజయ్-మురుగదాస్ మళ్లీ జత కట్టబోతున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబుతో ‘స్పైడర్’ చేస్తున్న మురుగదాస్.. ఆ తర్వాత చేయబోయే సినిమా విజయ్‌తోనే. మురుగదాస్ ఫ్రీ అయ్యే సమయానికి అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను ముగించేయడానికి ప్రయత్నిస్తున్నాడు విజయ్. ఆ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం. రూ.120 కోట్లతో సన్ పిక్చర్స్ విజయ్-మురుగదాస్ సినిమాను నిర్మించనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు