నాగ్ అడగటం ఆలస్యం కోర్కెలు తీరిపోతాయట

నాగ్ అడగటం ఆలస్యం కోర్కెలు తీరిపోతాయట

పెరిగే వయసు లెక్కకు మాత్రమే కానీ.. నా మీద ఎంతమాత్రం కాదన్నట్లుగా కనిపిస్తారు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. మేకప్ లేకున్నా అందగాడిగా కనిపించే ఈ నవమన్మధుడు తాజాగా ఓం నమో వెంకటేశాయ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను  తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగ్.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

తాను కోరుకున్న వెంటనే.. శ్రీవేంకటేశ్వరస్వామి తన కోర్కెల్ని తీర్చేస్తారని.. ఇప్పటికి అలాంటివి చాలాసార్లు చోటు చేసుకున్నాయని చెప్పారు. శాంపిల్ గా తాను కోరుకున్న కోర్కెల్ని బయటకు వెల్లడించారు. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లి బాధను చూడలేక.. స్వామీ అమ్మను తీసుకెళ్లిపో అని ప్రార్థించానని.. గంటల్లోనే ఆమెను తీసుకెళ్లిపోయారన్న నాగ్ తర్వాతి రెండు కోర్కెల్ని కూడా అడిగిన వెంటనే స్వామి తీర్చినట్లుగా చెప్పారు.

వేంకటేశ్వరస్వామి తన ఆరాధ్య దైవంగా చెప్పిన నాగ్.. ‘‘మా నాన్నగారి ఆఖరి సినిమా మనం హిట్ కావాలని కోరుకున్నా. ఆసినిమా సూపర్ హిట్ అయ్యింది. మంచి కుటుంబాన్ని ఇచ్చావు. ఇద్దరు పిల్లల్ని చల్లగా చూడు తండ్రి అని వేడుకున్నా. తిరుమలలో ఉన్నప్పుడు మా పిల్లలు ఇద్దరి పెళ్లిల గురించి తెలిసిందే. నా కోర్కెలన్నింటిని స్వామివారుతీర్చారు. స్వామివారు తీర్చిన కోర్కెల చిట్టా రోజురోజుకీ పెరిగిపోతోంది’’ అని చెప్పుకొచ్చారు. తాను తాజాగా నటిస్తున్న ఓం నమో వెంకటేశాయ తనకు.. రాఘవేంద్రరావుకు చివరి సినిమా అవుతుందేమో తెలియదు కానీ.. హిట్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. నాగ్ కోరుకున్నాక స్వామి వారు తీర్చకుండా ఉండరు కదా? అయినా.. రాఘవేంద్రరావుతో చివరి సినిమా అని ఎందుకు అనుకోవాలి? ఆయనతో మరో బంపర్ హిట్ సినిమా తీయాలని శ్రీవారిని కోరుకోవచ్చుగా..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు