దేవిశ్రీ నుంచి మరో కదిలించే పాట..

దేవిశ్రీ నుంచి మరో కదిలించే పాట..

పోయినేడాది సంక్రాంతికి రిలీజైన 'నాన్నకు ప్రేమతో' సినిమా ఆఖర్లో వచ్చే నాన్న పాట తండ్రిని ప్రేమించే ప్రతి ఒక్కరి హృదయాల్ని కదిలించింది. అంతకు కొన్ని రోజుల ముందే దేవిశ్రీ తండ్రి సత్యమూర్తి చనిపోయిన నేపథ్యంలో.. దేవిశ్రీ ఎంతో ఆర్ద్రతతో ఇది తన పాటే అన్నట్లుగా పాడాడు. జనాలకు అది బాగా చేరువైంది. ఈ ఏడాది సంక్రాంతికి అదే తరహాలో మరో కదిలించే పాటతో వస్తున్నాడు దేవి. చిరంజీవి సినిమా 'ఖైదీ నెంబర్ 150'లో ఇప్పటిదాకా రిలీజైన పాటలన్నీ హుషారెత్తించేవే. ఐతే తాజాగా విడుదల చేసిన 'నీరు' పాట వాటికి పూర్తి భిన్నంగా కదలించేలా ఉంది. ఇది రైతన్నల దీన స్థితికి అద్దం పట్టే పాట.

''నీరు నీరు నీరు.. రైతు కంట నీరు.. చూడనైన చూడరెవ్వరూ..
గుండెలన్ని బీడు.. ఆశలన్ని మోడు.. ఆదరించు నాథుడెవ్వరూ
అన్నదాత గోడు నింగినంటె నేడు.. ఆలకించు వారు ఎవ్వరూ..''

ఇలా సాగుతుంది 'ఖైదీ నెంబర్ 150'లోని పాట. దేవిశ్రీ చక్కటి కంపోజింగ్ కు తగ్గట్లుగా రామజోగయ్య శాస్త్రి కదిలించే లిరిక్స్ రాశారు. శంకర్ మహదేవన్ ఎంతో ఆర్తితో ఆ పాట పాడాడు. 'ఖైదీ నెంబర్ 150' మూల కథ రైతు సమస్యల నేపథ్యంలో సాగుతుంది. సినిమాలో దానికి సంబంధించిన ట్రాక్ వచ్చినపుడు ఈ పాట వస్తుంది. పాటలో ఉన్నంత డెప్త్ సినిమాలో కూడా ఉంటే.. 'ఖైదీ నెంబర్ 150' ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.