ఈ ఊర మాస్ దర్శకుడిని ఎవరు వద్దంటారు

తెలుగులోకి బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇద్దామని..

సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. తెలుగులో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘శౌర్యం’తో దర్శకుడిగా పరిచమయ్యాడు శివ. అతను స్వతహాగా తమిళుడే అయినా.. దర్శకుడిగా పరిచయం అయింది మాత్రం తెలుగు సినిమాతోనే. ఆ తర్వాత గోపీచంద్‌తోనే ‘శంఖం’ తీశాడు. కానీ అది ఆడలేదు. ఆ తర్వాత రవితేజతో చేసిన ‘దరువు’ సైతం ఫ్లాప్ అయింది. సరిగ్గా అప్పుడే కోలీవుడ్‌లోకి షిఫ్ట్ అయ్యాడు. రాజమౌళి-రవితేజల బ్లాక్‌బస్టర్ ‘విక్రమార్కుడు’ను ‘సిరుత్తై’ పేరుతో కార్తి హీరోగా రీమేక్ చేస్తే అది అక్కడ మంచి హిట్టయింది.

దీంతో అజిత్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. వీళ్ల కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘వీరం’ సూపర్ హిట్టయింది. మళ్లీ అదే కాంబినేషన్లో తెరకెక్కిన ‘వేదాళం’ సైతం సూపర్ హిట్టే. కానీ హ్యాట్రిక్ మూవీ ‘వివేగం’ మాత్రం దెబ్బ కొట్టేసింది. అయినా సరే.. అజిత్ మళ్లీ అతడితోనే ‘విశ్వాసం’ చేశాడు. అది బ్లాక్ ‌బస్టర్ అయింది.

ప్రస్తుతం శివ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘అన్నాత్తె’ చేస్తున్నాడు. అదయ్యాక సూర్యతో ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు శివ. ఇవి రెండూ వచ్చే ఏఢాదిలో పూర్తవుతాయి. ఆ తర్వాత టాలీవుడ్లో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడట శివ. అతడి చూపు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌ల మీద ఉన్నట్లు సమాచారం. మాస్ సినిమాలు బాగా డీల్ చేస్తాడన్న పేరు శివకు ఉంది. అతడి సినిమాలన్నీ ఊర మాస్ టైపే. తమిళంలో అతడిచ్చిన హిట్లను, తన సక్సెస్ రేట్‌ను చూసి తెలుగులో పెద్ద స్టార్లు నో చెప్పే ఛాన్సే లేదు.

అందులోనూ మన స్టార్లు కొంచెం వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో ఊర మాస్ సినిమాలు ట్రై చేస్తుంటారు. కాబట్టి తారక్, బన్నీల్లో ఎవరో ఒకరు శివకు ఓకే చెప్పే అవకాశముంది. ఐతే ఇద్దరూ ప్రస్తుతం తలో రెండు సినిమాలకు కమిట్మెంట్లు ఇచ్చారు. తారక్.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్, ప్రశాంత్‌ నీల్‌లతో సినిమాలు చేయాల్సి ఉంది. బన్నీ ‘పుష్ప’ తర్వాత కొరటాల శివకు కమిట్మెంట్ ఇచ్చాడు. మరి శివకు ఎవరితో సినిమా సెట్ అవుతుందో చూడాలి. ప్రయత్నం ఫలిస్తే.. 2022లో అతను తెలుగులోకి బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశముంది.