బాలీవుడ్ బాటలో తెలుగు దర్శకులు

హీరోలకే కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం కోసం హిందీ సినిమాలు చేయాలనే తాపత్రయం దర్శకులకూ ఉంటుంది. సందీప్ రెడ్డి వంగాకు యానిమల్ ఛాన్స్ వచ్చిందంటే దానికి కారణం అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ చేయడమే. ఇదే బాటలో గౌతమ్ తిన్ననూరి జెర్సీని ట్రై చేశాడు కానీ చేదు ఫలితం దక్కింది. శైలేష్ కొలను హిట్ ది ఫస్ట్ కేస్ ని నార్త్ ఆడియన్స్ కి పరిచయం చేయబోయి చేతులు కాల్చుకున్నాడు. బేబీ లాంటి సెన్సేషనల్ మూవీ తీసిన సాయి రాజేష్ కొత్త కథలు పక్కనపెట్టి హిందీ రీమేక్ పనుల్లో బిజీ అయ్యాడు. ఇంకో సంవత్సరం దాకా దానికి బ్లాక్ అయినట్టే.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రవితేజతో ఓ మూవీ ప్లాన్ చేసుకున్న గోపీచంద్ మలినేని బడ్జెట్ ఇష్యూస్ వల్ల హీరోని మార్చుకోవాల్సి వచ్చింది. ఇదే సంస్థలో సన్నీ డియోల్ తో చేయడం ఓకే అయ్యింది కానీ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. తాజాగా వంశీ పైడిపల్లి హీరో షాహిద్ కపూర్ కు ఒక లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడనే టాక్ గట్టిగా తిరుగుతోంది. తలపతి విజయ్ తో వారసుడు చేశాక వంశీకి టాలీవుడ్ స్టార్ల నుంచి పిలుపు రాలేదు. దీంతో తనకు మున్నా నుంచి చేయూతనిస్తూనే ఉన్న దిల్ రాజు నిర్మాతగా ఈ ప్రాజెక్టు సెట్ చేసుకున్నట్టు అప్ డేట్. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఒకప్పుడేమో కానీ ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి ప్యాన్ ఇండియాని దాటిపోయాక మన టాలెంట్ కి బాలీవుడ్ ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం పడట లేదు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ తదితరులు బాహుబలి, కెజిఎఫ్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్లను తీసి కేవలం డబ్బింగులుతో తమ ముద్రని ఉత్తరాది ప్రేక్షకుల్లో బలంగా వేయగలిగారు. కాకపోతే ఇక్కడ హీరోలు ఖాళీగా లేక టైం వృథా అవుతుందనుకునే డైరెక్టర్లు మాత్రం అటువైపు షిఫ్ట్ అయిపోతున్నారు. అటు కోలీవుడ్ లోనూ అట్లీ, మురుగదాస్ లాంటి వాళ్ళు సైతం ముంబైలోనే సెటిలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.