తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తాను ‘తోపుగా’ అభివర్ణించుకున్న జగ్గారెడ్డి.. రాజకీయాల్లో దూకుడుగా ఉంటే తప్పులేద న్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ నాయకుడికైనా పార్టీకైనా ఓటమి అనేక పాఠాలు నేర్పిస్తుందని తెలిపారు. అయితే.. తాను పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
తాను బలహీనుడిని కాదని.. అత్యంత బలవంతుడినని చెప్పుకొచ్చారు. ఎవరికీ అదిరి, బెదిరి బతికే మనస్తత్వం తనకు లేదని చెప్పారు. ఈ సందర్భంగా తనకు తానే.. తోపునని చెప్పుకొన్నారు. జగ్గారెడ్డి అంటే.. ఓ ఫైటర్. దీనిలో మరో మాటే లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి తమ కుటుంబం ఎంతో రుణ పడిపోయిందన్నారు. తాను ఓడిపోయినా.. తన సతీమణికి ఆయన కార్పొరేషన్ పదవిని ఇచ్చి గౌరవించారని, పార్టీలోనూ తనకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా గత విషయాలనుజగ్గారెడ్డి ప్రస్తావించారు. 1995లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాను దూకుడుగా వ్యవహరించానని చెప్పారు. అప్పటి ఎస్పీ అనుచరులను కూడా కొట్టినట్టు తెలిపారు. అంతేకాదు.. ఎస్పీ కారును కూడా తన కారుతో ఢీ కొట్టించానన్నారు. అప్పటి ఎన్నికల్లోనే రిగ్గింగ్ చేశానని.. తనను ఎవరూ ఆపేవారు లేరని చెప్పారు. అయితే.. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి వైరాగ్యం వ్యక్తం చేస్తూ.. ఇంత చేసినా ఏదో ఒక రోజు కాటికి వెళ్లాల్సిందేనన్నారు.
ఎన్నికలకు రాం రాం..
వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని జగ్గారెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన భార్య నిర్మల రంగం లోకి దిగుతుందన్నారు. ఇక, బీఆర్ ఎస్ నేతలపై నిప్పులు చెరుగుతూ.. రుణమాఫీని పూర్తి చేసినా.. కొంద రు తమపై విమర్శలు చేస్తున్నారని.. వారికి ప్రచారం ఎక్కువ, మాకు పని ఎక్కువ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ విషయంలో చర్చకు తాను సిద్ధమని మాజీ మంత్రి హరీష్ దగ్గర లెక్కలు ఉంటే చర్చకు రావాలని సవాల్ రువ్వారు.