ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వ ఉండేది కాదని, అప్పుల మీద అప్పులు చేసి పథకాలకు పప్పూ బెల్లాల్లాగా డబ్బులు పంచిపెట్టారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ చేస్తున్న అప్పులపై కాగ్ మొదలు కేంద్రం వరకు అందరూ హెచ్చరించినా పెడ చెవిన పెట్టి రాష్ట్రంపై పది లక్షల కోట్ల అప్పు జగన్ పెట్టారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి పార్ధసారధి కీలక వ్యాఖ్యలు చేశారు.
మేనిఫెస్టో పేరుతో గత ప్రభుత్వం దోపిడీ చేసిందని, ఐదేళ్ల జగన్ పాలనలో రూ. 10.50 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. అవినీతిని జగన్ వ్యవస్థీకృతం చేశారని మండిపడ్డారు. ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంక్షేమ పథకాలను చంద్రబాబు అమలు చేస్తున్నారని పార్ధసారధి కితాబిచ్చారు. వైసీపీ ప్రభుత్వం కనిపించిన పాసు పుస్తకంపై.. రేషన్ కార్డుపై పార్టీ రంగులు, బొమ్మలు వేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని ఎద్దేవా చేశారు.
తమ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయబోదని అన్నారు. లబ్ధిదారులకు ఇచ్చే గృహ నిర్మాణ వ్యయాన్ని రెండున్నర లక్షల నుంచి రూ.1.80 లక్షలకు తగ్గించింది జగన్ అని అన్నారు. ఇఖ, గత ప్రభుత్వం సాక్షి పత్రికకు నిధులు, ప్రభుత్వ ప్రకటనలను సాక్షికి మాత్రమే ఇచ్చిన వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.
రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఏపీలో సుస్థిర పాలన, చంద్రబాబు ఇమేజ్ చూసి పెట్టుబడిదారులు ఏపీకి క్యూ కడుతున్నారని చెప్పారు. ఒక్క రోజులోనే ప్రభుత్వ ఉద్యోగుల చేత 60 లక్షలకు పైగా పింఛన్లను పంపిణీ చేయించిన ఘనత చంద్రబాబుదని ఆయన కొనియాడారు.