తిర‌గ‌బ‌డ్డ ఎగ్జిట్ పోల్‌..

హ‌రియాణా.. దేశ‌రాజ‌ధాని ఢిల్లీతో స‌రిహ‌ద్దులు పంచుకునే రాష్ట్రం. ఇక్క‌డ తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత అధికార పార్టీ బీజేపీ ప‌రాజ‌యం పాల‌వుతుంద‌ని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ స‌ర్వేలు వెల్ల‌డించాయి. ఏబీపీ -సీ ఓట‌రు స‌ర్వే త‌ప్ప‌.. మిగిలిన‌వ‌న్నీ కూడా.. హ‌రియాణా ప్ర‌జ‌లు కాంగ్రెస్ వైపే చూస్తున్నార‌ని.. ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకోవ‌డం క‌మ‌ల‌నాథుల‌కు క‌ష్ట‌మేన‌ని చెప్పుకొచ్చాయి.

ప్ర‌జల మూడ్ కాంగ్రెస్ వైపే ఉంద‌ని కూడా లెక్క‌లు వేశాయి. కానీ, ఎగ్జిట్ పోల్ ఫ‌లితాను త‌ల‌కిందులు చేస్తూ.. ప్ర‌జ‌లు తీర్పు చెప్పారు. మ‌రోసారి బీజేపీవైపే మొగ్గు చూపించారు. అయితే.. ఫైట్ మాత్రం టఫ్‌గా సాగ‌డం గ‌మ‌నార్హం. బొటా బొటి మేజిక్ ఫిగ‌ర్‌తో బీజేపీ మ‌రోసారి అధికారం ద‌క్కించుకుంది. తాజాగా మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల నుంచి ప్రారంభ‌మైన ఈవీఎంల ఓట్ల లెక్కింపులో ఆదిలో కాంగ్రెస్ జోరు చూపించింది.

కానీ… రౌండ్లు పెరుగుతూ.. కౌంటింగ్ పూర్త‌య్యే స‌మ‌యానికి.. బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. తొలి రెండు రౌండ్ల‌లో వెనుక‌బ‌డ్డ‌.. బీజేపీ త‌ర్వాత త‌ర్వాత‌.. త‌న స‌త్తా చాటుతోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హ‌రియాణాలో ఒకే విడ‌త‌లో పోలింగ్ నిర్వ‌హించారు. ఈ నెల 4 న జ‌రిగిన పోలింగ్ అనంత‌రం.. మంగ‌ళ‌వారం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

తాజాగా అందిన స‌మాచారం మేర‌కు మేజిక్ ఫిగ‌ర్ 46 స్థానాల‌కు గాను బీజేపీ ఏక‌ప‌క్షంగా ఈ సీట్ల‌ను ద‌క్కించుకుంది. దీంతో అధికారంలోకి వ‌చ్చేందుకు కావాల్సిన స్థానాలు క‌మ‌ల నాథులకు ద‌క్కాయి. ఇక‌, కాంగ్రెస్‌కు 37 చోట్ల విజ‌యం ద‌క్కింది. అదేవిధంగా స్తానిక పార్టీ ఐఎస్ ఎల్‌డీ పార్టీ 3 స్థానాల్లోనూ.. ఇండిపెండెంట్లు 4 స్థానాల్లోనూ విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో వ‌రుస‌గా మూడోసారి కూడా బీజేపీ హ‌రియాణాలో అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మైంది.