ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత, అప్పటి సీఎం జగన్ అనేక మార్పులు చేశారు. నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పొరుగు నియోజకవర్గాలకు బదిలీ చేశారు. కొందరు ఆప్తులను మాత్రం వారి వారి నియోజకవర్గాల్లోనే కొనసాగించారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఇలా మార్పులు చేసిన చోటే కాకుండా.. సిట్టింగ్ స్థానాల్లో ఉన్న అభ్యర్థులను కూడా ప్రజలు ఓడించారు. అంటే.. మార్పులు.. మరకలు వేశాయనే చెప్పాలి.
ఇక, ఇప్పుడు ఎన్నికల తర్వాత.. నాలుగు మాసాలకు వైసీపీలో మరోసారి మార్పులకు జగన్ శ్రీకారం చుట్టారు. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు నాయకులు వేర్వేరు నియోజకవర్గాలకు వెళ్లిపోయిన దరిమిలా.. ఇప్పుడు తమ తమ స్థానాలకు పంపించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. తమ పాత నియోజకవర్గాలకు వెళ్లి.. రాజకీయాలను సెట్ చేసుకుంటామని వారు కోరుతున్నారు. కానీ, దీనికి భిన్నంగా మరో వ్యూహంతో జగన్ అడుగులు వేస్తున్నారు.
సామాజిక వర్గ సమీకరణల ఆధారంగా కాకుండా.. వ్యక్తుల ప్రాధాన్యాన్ని అనుసరించి జగన్ మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్.. తన సొంత నియోజకవర్గం వెస్ట్‌కు వెళ్లిపోతానని కొన్నాళ్లుగా చెబుతున్నారు. కానీ, ఆయనను జగ్గయ్యపేట నియోజకవర్గానికి షిఫ్ట్ చేస్తున్నారని తెలిసింది. అదేసమయంలో సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును విజయవాడ తూర్పునకు బదిలీ చేస్తున్నారట.
తూర్పు నియోజకవర్గంలో ఉన్న యువనాయకుడు.. దేవినేని అవినాష్ చౌదరిని పెనమలూరు నియోజ కవర్గానికి, అక్కడి జోగి రమేష్‌ను మైలవరానికి పంపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా గుంటూరు జిల్లాకు వచ్చే సరికి పెదకూరపాడు నుంచి తాజా ఎన్నికలలో సెట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో పోటీ చేసిన నంబూరు శంకరరావును సత్తెనపల్లికి బదిలీ చేస్తున్నారు. సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు.
ఇక, చిలకలూరి పేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన కావటి మనోహర్ నాయుడును పెదకూరపాడు నియోజకవర్గం బాధ్యతలు చూసుకోవాలని చెప్పారట. అదేసమయంలో అంబటి రాంబాబుకు పొన్నూరు నియోజకవర్గ పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు జిల్లాలపై కసరత్తు చేసిన జగన్.. సామాజిక వర్గాల ఆధారంగా కాకుండా.. నియోజకవర్గాలు, వ్యక్తుల ఆధారంగా చర్యలు తీసుకోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates