అక్టోబరు 2 జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ
కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు తొలుత చీపురు పట్టుకుని వీధులు శుభ్రం చేశారు. అనంతరం ఓ మొక్కను నాటారు. ఈ సమయంలోనే ఆయన పారిశుద్ధ్య కార్మికులతోనూ భేటీ అయ్యారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు.
రెండు సంచలన నిర్ణయాలను చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. వీటిలో 1) నేటి నుంచి (అక్టోబరు 2) చెత్త పై విధిస్తున్న పన్నును రద్దు చేస్తున్నట్టు తెలిపారు. చెత్తపై పన్నును ఎట్టి పరిస్థితిలోనూ ఎక్కడా వసూలు చేయబోమన్నారు. గృహ , వాణిజ్య, వ్యాపార సముదాయాలకు కూడా చెత్తపన్ను ఇకపై ఉండబోదన్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు కూడా ఇదే విధానం అమలు చేయనున్నట్టు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అందరినీ పీక్కుతిందని ఈ సందర్భంగా చంద్రబాబు నిప్పులు చెరిగారు.
ఇక, 2) ఆంధ్ర జాతీయ కళాశాలకు.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేరును పెట్టనున్నట్టు చంద్రబాబు తెలిపారు. కొందరు స్వార్థ పరులు ఆంధ్ర జాతీయ కళాశాలను కబ్జా చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. తమ ప్రభుత్వం దాన్ని త్వరలోనే స్వాధీనం చేసుకుంటుందన్నారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు మీద వైద్యకళాశాలను ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు వివరించారు.
మోడీకి థ్యాంక్స్!
కాగా, ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్‌కు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారన్న చంద్రబాబు.. దీనికి గాను స్వయంగా తాను థ్యాంక్స్ చెబుతున్నట్టు తెలిపారు. అదేవిధంగా మోడీ ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌లో స్వచ్ఛభారత్‌పై ఉపసంఘానినిక తాను చైర్మన్‌గా ఉన్నానని గుర్తు చేశారు. కాగా, మోడీ స్పూర్తితో స్వచ్ఛ ఆంధ్రప్రదేశే ధ్యేయంగా అందరూ పయనించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలని పిలుపునిచ్చారు.