రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు… ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. `ఆటవిడుపు` పేరుతో మూడు రోజుల పాటు.. ప్రజాప్రతినిధులు, మంత్రులకు ఆటల పోటీలను.. మంగళవారం సాయంత్రం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధుల మధ్య టగ్ ఆఫ్ వార్, రన్నింగ్, తదితర పోటీలు నిర్వహించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ టీం లీడర్లగా వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ… నిత్యం ప్రజలతో, రాజకీయాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు బయటకు వెళ్లినా, ఇంటికి వెళ్లినా, అసెంబ్లీలో ఉన్నా నిరంతరం టెన్షన్ వాతావరణమే ఉంటుందని, ఈ ఒత్తిడి నుంచి ప్రశాంతత పొందేందుకు ఇలాంటి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు కూడా క్రీడల్లో పాల్గొనాలని హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో తొలిసారిగా క్రీడా పోటీలు నిర్వహించారని స్పీకర్ తెలిపారు. అప్పట్లో తాను, బుచ్చయ్య చౌదరి మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ క్రీడల్లో పాల్గొన్నామన్నారు. ప్రస్తుతం సభలో 78 శాతం మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారని, వారి ఉత్సాహాన్ని చూసి క్రీడలను ప్రోత్సహిస్తున్నా మన్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ పాల్గొనేలా వయసుల వారీగా క్రీడలను విభజించా మని తెలిపారు.
టగ్ ఆఫ్ వార్..
అనంతరం.. నిర్వహించిన క్రీడల పోటీల్లో స్పీకర్ వర్సెస్ డిప్యూటీ స్పీకర్ బృందాల మధ్య టగ్ ఆఫ్ వార్ నిర్వహించారు. ఈ పోటీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జట్టు విజయం దక్కించుకుంది. స్పీకర్ సరసన.. విప్.. ఆంజనేయులు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు. టగ్ ఆఫ్ వార్ లో విజయం సాధించిన డిప్యూటీ స్పీకర్ జట్టును స్పీకర్ అయ్యన్న ప్రశంసించారు. రాజకీయాలేకాదు.. క్రీడల్లోనూ సత్తా చాటుతున్నారని రఘురామకు కితాబునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates