ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వాస్త‌వానికి ఎన్నిక‌ల్లో ఓటు బ్యాంకు ఎంత వ‌చ్చింద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. పార్టీ ప‌రంగా కాంగ్రెస్ విప‌క్ష పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే. త‌ర‌చుగా పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగిస్తున్నారు. ఇదిలావుంటే.. జిల్లాల స్థాయిలో నాయ‌కుల ప‌రిస్థితి ఏంటి? నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్‌ల ప‌రిస్థితి ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

ప్ర‌స్తుతం పార్టీకి ఫండింగ్ లేదు. స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాలు కూడా లేవు. దీంతో కార్య‌క‌ర్త‌ల హ‌డావుడి, నాయ‌కుల సంద‌డి పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. జిల్లాల్లో కూడా పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. నాయ‌కులకు ఆర్థిక స‌మ‌స్య‌లు పెరిగిపోవ‌డ‌మేన‌ని తెలుస్తోంది. కొంద‌రు ఇంటికే ప‌రిమితం కాగా.. మ‌రికొంద‌రు సొంత ప‌నుల్లో బిజీ అయ్యారు. ఫ‌లితంగా కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దగా ప్ర‌స్తావ‌న లేకుండా పోయింది.

ప్ర‌తి ఒక్క‌రూ 100 ఇవ్వండి..

కాంగ్రెస్ దుస్థితి ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా మారింది. జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా ఉన్న శివ గ‌ణేష్ ..పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు నిర్వహించేందుకు త‌న దగ్గ‌ర కానీ.. పార్టీ నాయ‌కుల ద‌గ్గ‌ర కానీ నిధులు లేవ‌ని బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితిపై పోరాడేందుకు.. ప్ర‌జ‌ల త‌ర‌ఫున గ‌ళం వినిపించేందుకు ప్ర‌జ‌లే త‌న‌ను బ‌ల‌ప‌ర‌చాల‌ని ఆయ‌న వేడుకున్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ త‌న‌కు 100 రూపాయ‌ల చొప్పున ఆర్థిక సాయం చేయాల‌ని అభ్య‌ర్థించారు. దీనికి ఆయ‌న ఏకంగా 996365589 ఫోన్ నెంబ‌రు కూడా ప్ర‌జ‌ల‌కు ఇచ్చారు. ఒక్క ఈ నియోజ‌క‌వ‌ర్గ‌మే కాదు.. దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కాంగ్రెస్ నాయ‌కుల ప‌రిస్థితి ఇలానే ఉంది. పార్టీ ఖ‌జానాలో నిధులు ఎన్ని ఉన్నాయో తెలియ‌దు.

స్థానికంగా అవుతున్న ఖ‌ర్చుల‌కు కూడా పార్టీ నుంచి రూపాయి రావ‌డం లేద‌ని తుల‌సి రెడ్డి వంటి సీనియ‌ర్ నాయ‌కులు కూడా అంత‌ర్గ‌త స‌మావేశాల్లో చెబుతున్నారు. సో.. ఇదీ కాంగ్రెస్ ప‌రిస్థితి.. నేత‌ల దుస్థితి.. మ‌రి ష‌ర్మిల ఏం చేస్తారోచూడాలి.