సీఎం చంద్రబాబు.. ఏపీ బీజేపీ చీఫ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి వరసకు మరిది అవుతారన్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు వరకు కూడా ఎడమొహం పెడమొహంగా ఉన్న ఈ ఇద్దరు నాయకులు కూడా.. పొత్తులు కుదిరిన తర్వాత నుంచి గెలిచిన తర్వాత నుంచి సహకారం ప్రారంభించారు. గతంలో ఏనాడూ బహిరంగ వేదికలపై పురందేశ్వరి మాట కూడా పలకని చంద్రబాబు ఇటీవల కాలంలో అనేక సార్లు ఆమెతో చర్చలు చేశారు. బహిరంగ వేదికలపైనా మాట్లాడారు.
పురందేశ్వరి గారు.. అంటూ పలు సందర్భాల్లో చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక, పురందేశ్వరి కూడా.. టీడీపీ విషయంలో చాలా వరకు పొత్తు ధర్మంతో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ విషయంపై ఆమె స్పందించారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆమె దాదాపు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలా దేవుడిని రాజకీయాలకు ఆపాదిస్తారా? అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
ఏ ఆధారాలతో లడ్డూ కల్తీ అయిందని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో వైరల్ అయ్యాయి. వీటిపై స్పందించేందుకు టీడీపీ నేతలు ఎవరూ ముందుకు రాలేదు. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని వారు వెనక్కి తగ్గారు. పార్టీ అధిష్టానం కూడా.. ఈ విషయంపై ఆచి తూచి మాట్లాడా లని నిర్ణయించింది. ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆమె పరోక్షంగా తప్పుబట్టారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ని ఉద్దేశించి ఇలా వ్యాఖ్యలు చేయొచ్చా? అని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలలో తప్పేముందన్నారు. తనకు అందిన రిపోర్టులను బట్టి చంద్రబాబు మాట్లాడారని, ముఖ్య మంత్రి కాకపోతే.. ఇంత కీలక విషయంపై ఎవరు మాట్లాడతారని కూడా పురందేశ్వరి ప్రశ్నించారు. మొత్తానికి మరిదిని ఆమె వెనుకేసుకువచ్చారు.