ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. విశ్లేషకులు ఈ మాటే చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో వలస రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు వరదలు-పరిహారం విషయాలు రాజకీయంగా దుమారం రేపుతున్నా.. మరోవైపు ఓడిపోయిన నాయకులు, వైసీపీ నేతలు.. తమ దారులు తాము చూసు కుంటున్నారు. ఈ క్రమంలో మెజారిటీ నాయకులు జనసేనవైపు మొగ్గు చూపుతున్నారు. వైసీపీలో ఉండలేక చాలా మంది జంప్ చేస్తున్నారు.
ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉదయభాను వంటి కీలక నాయకులు జనసేన జెండా కప్పుకొన్నారు. ఇక, స్థానిక సంస్థలకు సంబంధించి కూడా వందల సంఖ్యలో నాయకులు పార్టీలు మారుతున్నారు. వీరందరి చూపు.. టీడీపీ కంటే జనసేన వైపే ఎక్కువగా ఉండడం గమనార్హం. టీడీపీలో నేతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలా జనసేన వైపు చూస్తున్నారన్నది ఒక చర్చ. అయితే.. వైసీపీని చీల్చి తాము లబ్ది పొందాలని కాంగ్రెస్ భావించింది.
ఈ క్రమంలోనే వైఎస్ కుమార్తె షర్మిలకు పార్టీ పగ్గాలు కూడా అప్పగించింది. అయినా కూడా ఎవరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం లేదు. వెళ్తే.. టీడీపీ, లేకపోతే జనసేన అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. అలాగని షర్మిల నాయకత్వాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. ఆమె చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్లు కూడా ఇవ్వడం లేదు. ఈ పరిణామాలు కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి. జనసేనలో చేరుతున్న నాయకులను పరిశీలిస్తే.. వీరికి సుదీర్ఘకాలం.. వైఎస్‌తో అనుబంధం ఉంది.
అలాంటి నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు కానీ, షర్మిల వైపు కానీ మొగ్గు చూపడం లేదు. దీంతో ఇక, జనసేన కాదని అంటే తప్ప.. ఆ నాయకులు కాంగ్రెస్‌లో చేరే పరిస్థితిలేదు. కానీ, జనసేనకు కేడర్ లేకపోవడం, బలమైన నాయకుల అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో వద్దనే పరిస్థితి లేదు. పైగా.. కాంగ్రెస్ బలపడితే.. తమ ఓటు బ్యాంకు చీలిపోయే పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే.. జనసేన ఎవరు వచ్చినా రెడీ అంటూ.. చేర్చేసుకుంటండడంతో కాంగ్రెస్ డీలా పడుతోంది.