హైడ్రా ‘కూల్చివేతల’ సీరియల్ బంద్?

రేవంత్ ప్రభుత్వానికి వాస్తవం అర్థమవుతున్నట్లుంది. ఒకేసారి రెండు ప్రక్షాళనలు చేసేందుకు ఏ పాలకుడు ఇష్టపడడు. అలాంటిది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఒకే టైంలో రెండు భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ చెరువుల్ని సంరక్షించుకోవటం.. చెరువుల్ని చెరబట్టినోళ్ల సంగతి చూసేందుకు హైడ్రాను రంగంలోకి దించితే.. మరో వైపు మూసీ ప్రక్షాళనకు భారీ ప్రాజెక్టును టేకప్ చేశారు ఈ రెండు అంశాల్లోనూ కామన్.. ఇప్పుడు నివాసం ఉంటున్న వారు తమ ఇళ్లను కోల్పోవటం.
ఇలాంటి ఇష్యులకు చాలా ప్రిపరేషన్ అవసరం. ఒకలాంటి మూడ్ ను తీసుకురావటం చాలా ముఖ్యం. సంపన్నులు.. సమాజంలో గుర్తింపు ఉన్న బడా మనుషులకు సంబంధించిన అక్రమ కట్టడాలపై చట్టపరమైన చర్యల్ని తీసుకునే వేళలో.. ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆ జోరులో.. మధ్యతరగతిని టచ్ చేస్తే మొదటికే మోసం వచ్చే పరిస్థితి. ఇప్పుడు హైడ్రా విషయంలో అలాంటిదే చోటు చేసుకుంది.

హైడ్రా చేపట్టిన కూల్చివేతల్లోఎక్కువగా టార్గెట్ అయ్యింది మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతి వారు. దీనికితోడు హైడ్రా పేరుతో పుకార్లు షికార్లు కొట్టటం.. ఏదో జరిగిపోతుందన్న భయాందోళనలు ఎక్కువ కావటం.. సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం భారీగా మొదలుకావటంతో ఇప్పుడు రేవంత్ సర్కారుకు ఊపిరి ఆడని పరిస్థితి. ఇది సరిపోనట్లుగా బాధితులు బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి.. తమ గోడును చెప్పుకోవటం.. తమకు అండగా ఉండాలని కోరటం లాంటి పరిణామాలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది.

దీంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో తదుపరి కూల్చివేతలు అన్నవి లేకుండా ఉండేలా అనధికార ఆదేశాలు జారీ అయినట్లుగా తెలుస్తోంది. గతంలో వారాంతం వస్తే ఒకలా ఉండేది. ఇప్పుడు వారాంతం అన్నంతనే టెన్షన్ టెన్షన్ అన్నట్లుగా పరిస్థితులు మారాయి. ఇలాంటివేళ.. ఈ వీకెండ్ నుంచి కొద్ది కాలం పాటు కూల్చివేతలు ఉండవన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికితోడు.. అధికారపార్టీకి అండగా ఉంటుందన్న మీడియా సంస్థల నుంచి సైతం.. హైడ్రా కూల్చివేతలపై వస్తున్న నెగిటివ్ వార్తలతో ప్రభుత్వం అలెర్టు అయ్యిందని.. కొంతకాలం కూల్చివేతలకు కామా పెట్టాలన్న అభిప్రాయానికి వచ్చి.. సంబంధిత వర్గాలకు ఆదేశాలు జారీ అయినట్లుగా తెలుస్తోంది.