ఏపీలో జగన్ సర్కారు ఏర్పడి.. దాదాపు ఏడాదిన్నర పూర్తవుతోంది. ఈ కాలంలో అనేక కార్యక్రమాలు, పథకాలను తెరమీదికి తెచ్చారు. ప్రజలకు.. ప్రభుత్వ సేవలను చేరువ చేశారు. ఈ క్రతువులో ముఖ్యంగా కీలక భూమిక పోషించాల్సిన పాత్రను మంత్రులపైనే పెట్టారు సీఎం జగన్. ప్రజలకు చేరువ అవండి.. ప్రజలలో ఉండండి.. ప్రభుత్వ కార్యక్రమాలను వారికి చేరువ చేయండి.. ఇలా అనేక రూపాల్లో దిశానిర్దేశం చేశారు. మరి ఈ ప్రణాళికను పాటించింది ఎంతమంది? జగన్ సూచనలను తలకెత్తుకుంది.. ఎందరు? .. ఈ ప్రశ్నలు వైసీపీ వర్గాల్లో ముఖ్యంగా మంత్రి పదవుల రేసులో ముందున్న నాయకుల మధ్య చర్చకు వస్తున్నాయి.
జగన్.. తన కేబినెట్‌ను ఏర్పాటు చేసుకునే సమయంలోనే ఒక వ్యాఖ్య చేశారు. రెండున్నరేళ్లలో తన మంత్రి వర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని. కాబట్టి.. మరో ఏడాదిలో మంత్రి వర్గాన్ని మార్చడం ఖాయం. ప్రస్తుతం జగన్‌తో కలిపి మొత్తం పాతిక మంది మంత్రులు ఉన్నారు. వీరిలో జగన్ సహా ఇటీవల కొత్తగా వచ్చిన ఇద్దరు మంత్రులను పక్కన పెడితే.. మిగిలిన 22 మంది మంత్రులు ఏడాదిన్నరగా ఉన్నారు. మరి ఏడాది తర్వాత మంత్రి వర్గం మొత్తాన్ని మార్చాల్సి వస్తే.. వీరు మొత్తం.. తమ బెర్త్‌లను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే, అది సాధ్యమేనా? అనేది కూడా చర్చకు వస్తోంది. కీలకమైన పదవుల్లో ఉన్నవారు.. జగన్ తరఫున మాట్లాడుతున్నవారు.. ఓ పది మంది మంత్రులు ఉన్నారు.
బుగ్గన రేజేంద్రనాథ్‌రెడ్డి, కొడాలి నాని, కన్నబాబు, అనిల్‌కుమార్, గౌతంరెడ్డి, కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేశ్, పేర్ని నాని వంటివారు ఓ పది మంది వరకు జగన్‌కు అత్యంత సన్నిహితులు. పైగా వీరి గ్రాఫ్ కూడా బాగానే ఉంది. దీంతో మిగిలిన వారి పరిస్థితి ఏంటి? మరీ ముఖ్యంగా ముగ్గురు మహిళా మంత్రుల గ్రాఫ్ దారుణంగా ఉందని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాల దూకుడుకు ముకుతాడు వేయడంలో హోం మంత్రిగా సుచరిత ఆశించిన రేంజ్ చూపించడం లేదు. ఇక, సొంత కుటుంబం నుంచి జగన్ పాలనపై విమర్శలు వస్తే.. డిప్యూటీ సీఎంగా ఉన్న పుష్ప శ్రీవాణి పట్టించుకోలేదు.
మరో మంత్రి, కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత సైలెంట్ గా పనిచేసుకు పోతున్నా.. ఆశించిన ర్యాంకు మాత్రం సాధించలేక పోతున్నారు. మిగిలిన వారిలో మైనార్టీ మంత్రి అంజాద్ బాషా, శ్రీరంగనాథరాజు, నారాయణస్వామి తదితరుల పనితీరు ఆసక్తికరంగా లేదు. దీంతో ఈ మంత్రులకు పదవీ గండం పొంచి ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, వీరికి ఉన్న అవకాశం ఏంటంటే.. మరో ఏడాది. ఈ ఏడాది కాలంలో పార్టీలోను, ప్రభుత్వంలోను పుంజుకుంటే.. వారి పదవులు పదిలంగా ఉంటాయని లేకుండా బెర్త్ ఖాళీ చేయడమేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.