తిరుమ‌ల ల‌డ్డూపై బాబు కామెంట్స్‌.. వైసీపీ నేతల రియాక్ష‌న్‌

తిరుమ‌ల శ్రీవారి పవిత్ర ప్ర‌సాదం ల‌డ్డూపై సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా మంట‌పుట్టించాయి. చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై వైసీపీ మాజీ మంత్రి స‌హా.. ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యులు క్ష‌ణాల్లోనే స్పందించారు. నిజానికి వైసీపీపై చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ఇటీవ‌ల కాలంలో ఇంత వేగంగా ఎవ‌రూ స్పందించ‌లేదు. కానీ, తాజాగా మాత్రం మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యుడు, మాజీ సీఎం జ‌గ‌న్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి వెంట‌నే రియాక్ట్ అయ్యారు. ఇద్ద‌రూ కూడా సామాజిక మాధ్య‌మం ఎక్స్‌లో పోస్టులు చేశారు.

బాబు విష‌యాన్ని ప‌రిశీలిస్తే..కూట‌మి ప్ర‌భుత్వం 100 రోజుల పాల‌న‌పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో భేటీ అయిన ఆయ‌న‌.. తిరుమ‌ల శ్రీవారి ప్ర‌సాదం, అక్క‌డ జ‌రుగుతున్న నిత్యాన్న‌దాన ప్ర‌సాద విత‌ర‌ణ‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ పాల‌న‌ను ఉద‌హ‌రిస్తూ.. తిరుమ‌ల‌ను ధ్వంసం చేశార‌ని..చెప్పారు. ప‌విత్ర‌మైన తిరుమల శ్రీవారి ల‌డ్డూలో నాణ్య‌మైన ఆవునెయ్యిని వినియోగించాల్సి ఉండ‌గా.. జంతువుల కొవ్వును వాడి.. నాశ‌నం చేశార‌ని చెప్పారు. అదేవిధంగా అన్న ప్ర‌సాదాల‌లోనూ నాణ్య‌త‌ను త‌గ్గించి.. భ‌క్తుల మ‌నోభావాల‌ను, తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కూడా దెబ్బ‌తీశార‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు.

ఈ నేప‌థ్యంలో వైసీపీ మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు వెంట‌నే స్పందించారు. చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. “దివ్వ క్షేత్రం తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను, కోట్లాది మంది హిందువుల విశ్వాసాల‌ను దెబ్బ‌తీసి చంద్ర‌బాబు నాయుడు పెద్ద పాప‌మే చేశాడు. తిరుమ‌ల ప్ర‌సాదంపై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు అంత్యంత దుర్మార్గం. మ‌నిషి పుట్టుక పుట్టిన వారు ఎవ‌రూ ఇలాంటి మాట‌లు మాట్లాడ‌రు. ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌రు” అని రాంబాబు వ్యాఖ్యానించారు.

ఇదేస‌మ‌యంలో వైవీ సుబ్బారెడ్డి కూడా ఎక్స్‌లో స్పందించారు. “రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఎంత‌టి నీచానికైనా చంద్ర‌బాబు వెనుకాడ‌డ‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది. భ‌క్తుల విశ్వాసాన్ని బ‌ల‌ప‌రిచేందుకు తిరుమ‌ల ప్ర‌సాదం విష‌యంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్ర‌మాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. చంద్ర‌బాబుకూడా త‌న కుటుంబంతో సిద్ధ‌మా!” అని స‌వాల్ రువ్వారు. మ‌రి దీనిపై టీడీపీ నాయ‌కులు, మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.