అబద్ధాన్ని నిజంగా.. నిజాన్ని అబద్ధంగా చెప్పటానికి మించిన దుర్మార్గం మరొకటి ఉండదు. విజయవాడను వరద ముంచెత్తిన వేళ… ఏపీ రాజధాని అమరావతిలో పరిస్థితి ఎలా ఉంది? రాజధాని ప్రాంతం మొత్తం మునిగిపోయిందా? అని ఆసక్తికర డిబేట్ జరుగుతోంది.
వరదల నేపథ్యంలో రాజధాని అమరావతి మొత్తం మునిగిపోయిందన్న ప్రచారం మొదలైంది. అయితే.. దీనికి కౌంటర్ గా పలువురు సెల్పీ వీడియోలు తీస్తూ.. గ్రౌండ్ రిపోర్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి వాదన వారిదే అన్నట్లుగా మారింది. ఇలాంటి వేళ.. అసలు నిజం ఏమిటి? వరద వేళ రాజధాని అమరావతి మునిగిందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
రాజధాని అమరావతికి తాజాగా చుట్టుముట్టిన వరద ముప్పు లేదు. రాష్ట్ర పాలనకు కీలకమైన సచివాలయం వరద ముప్పు నుంచి సేఫ్ గా ఉంది. ఎమ్మెల్యే.. ఐఏఎస్ అధికారుల నివాసాల వద్ద కూడా ముంపు పరిస్థితి లేదు. వచ్చిన వరద వచ్చినట్లుగా కొండవీటి వాగు ఎత్తిపోతల ద్వారా క్రిష్ణానదిలోకి వెళ్లిపోతోంది. అయినప్పటికీ వరదలో అమరావతి చిక్కుకుపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
గుంటూరు జిల్లా ఎస్ఆర్ఎం వర్సిటీ ప్రాంతంలో రెండు రోజుల్లో 42 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఒక దశలో గంటకు ఆరు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అమరావతి రాజధానికి సమీపంలో ఉండే ప్రాంతంలో నిర్మించిన ఈ క్యాంపస్ లో సోమవారం స్నాతకోత్సవం యథావిధిగా సాగింది. ఒకవేళ.. వరద ముప్పు ఉండి ఉంటే.. వేల మంది విద్యార్థుల నడుమ ఆ కార్యక్రమం జరిగి ఉండేదా? ఒకవేళ.. వరద ముప్పు ఉండి ఉంటే.. అక్కడున్న విద్యార్థుల మీదా.. వారి భద్రత మీద ఇప్పటికేబోలెడన్ని కథనాలు రావాలిగా? ప్రభుత్వం.. మీడియా పక్షపాతం వహిస్తుందని భావించినా.. విద్యార్థుల తల్లిదండ్రులు నానా రచ్చ చేసేవారు కదా?
ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భవనాల దగ్గర కూడా వాన నీళ్లు ఆగిన పరిస్థితి లేదు. ఈ భవనాల ముందు.. వెనుకా కూడా వరద కాదు కదా వర్షపు జాడ కనిపించని పరిస్థితి.
నేల మాత్రం తడిగా ఉంది. వెంకటపాలెం మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి మందడం వరకు సీడ్ కయాక్సెస్ రహదారిని పరిశీలిస్తే ఎక్కడా నీరు నిలిచిన దాఖలాలు లేవు. సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారి మీదా ఎక్కడ వాన నీరు నిలిచిన పరిస్థితి లేదు. మొత్తంగా వరద కారణంగా రాజధాని అమరావతి మునిగిపోయిందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates