ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి రాత్రంతా జాగారం చేశారు. విజయవాడ పరిసరప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోవడం తో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ప్రతి రెండు గంటలకు టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. అదేవిధంగా మీడియాను సైతం నిద్రపోనివ్వకుండా.. పదే పదే వారి నుంచి కూడా సమాచారం సేకరించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోనే సీఎం ఉన్నారు. అక్కడి నుంచే విజయవాడ పరిస్థితిని ఆయన గంట గంటకూ సమీక్షించారు. బాధితులకు ఆహారం , తాగునీరు అందించే బాధ్యతలను విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీకి అప్పగించారు.
ఇదేసమయంలో మంత్రులు ఎక్కడున్నా తక్షణమే విజయవాడకు రావాలని ఆదేశించారు. ఆకలితో అలమటిస్తున్నవారిని ఎంత రాత్రయినా కూడా ఆదుకోవాలని.. వారికి పులిహోర, పెరుగన్నం తక్షణం అందించాలని అన్ని ప్రైవేటు హోటళ్లను చంద్రబాబు ఆదేశించారు. అదేసమయంలో 5 లక్షల వాటర్ బాటిళ్లను తక్షణం బాధిత ప్రాంతాలకు తరలించాలని కూడా చంద్రబాబు సూచించారు. ఈ బాధ్యతలను కూడా పార్టీ నాయకులు, మంత్రులు తీసుకోవాలన్నారు. ఎక్కడా అలసత్వం చేస్తే.. సహించేది లేదన్నారు. రాత్రి పూట కూడా.. మరో సారి సింగ్ నగర్ ప్రాంతంలో వరదలో చిక్కుకున్నవారిని పరామర్శించారు.
కేంద్రం నుంచి సాయం
చంద్రబాబుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి.. విజయవాడ సహా.. రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాము అండగా ఉంటామని.. అన్ని విధాలా సాయం చేస్తామని చంద్రబాబుకు ఆయన భరోసా ఇచ్చారు. ఆవెంటనే 6 హెలికాప్టర్లను విజయవాడకు పంపించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా పునరావాస కేంద్రాల్లోని వారికి ఆహారం అందించేందుకు మిలటరీ సాయం కూడా అందిస్తామని తెలిపింది. బాధితులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు తాము కూడా పనిచేస్తామన్నారు. ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బందిని కూడా.. పంపించారు. కాగా.. రాత్రి వేళల్లో కూడా చంద్రబాబు నేతృత్వంలో సహాయం అందించేందుకు సిబ్బంది యుద్ధప్రాతిపదికన ముందుకు కదిలారు.