బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రజల్లోకి రానున్నారు. వినాయక చవితి పర్వదినం ముగిసిన తర్వాత ఆయన ప్రజలను నేరుగా కలుసుకునేందుకు.. పర్యటించాలని నిర్ణయించినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కేసీఆర్ ఎండగడతారని.. ప్రజలతో కలిసి ఉద్యమానికి రెడీ అవుతారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజల నుంచి నిరంతరం.. లేఖలు, ఫోన్లు, సందేశాల రూపంలో కేసీఆర్‌కు అనేక విన్నపాలు వస్తున్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వీటిలో ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్టు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం మానేసిన.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఈ విషయాన్ని దారి మళ్లించేందుకు.. రాజకీయ నేతల నోరు నొక్కేందుకు హైడ్రా సంస్థను తీసుకువచ్చిందనేది కేసీఆర్ అభిప్రాయంగా చెబుతున్నారు.
కొన్ని దశాబ్దాలుగా ఉన్న నిర్మాణాలు.. రేవంత్‌రెడ్డికి ఇప్పుడే గుర్తుకు వచ్చాయా? అనేది కేసీఆర్ ప్రశ్నగా ఉందన్నారు. దీనికితోడు రైతు రుణ మాఫీలోనూ అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఫిర్యాదులు అందాయని.. ఇక, ఇతర పథకాల అమలుపై కూడా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. అందుకే వారి తరఫున పోరాటం చేసేందుకు కేసీఆర్.. ఈ నెల 10 తర్వాత.. నేరుగా ప్రజాక్షేత్రంలోకి దిగనున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వివరించాయి. ఈ పర్యటనకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని తెలిపాయి.
ఆరు గ్యారంటీల అమలు, అదుపుతప్పిన పాలనపై ‘సమరశంఖం’ పేరుతో ఉద్యమాన్ని నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కాగా, అనారోగ్య కారణాలతో కేసీఆర్.. గత కొన్నాళ్లుగా ఇంటికే పరిమితం అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా.. ఒక్కరోజు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత.. మళ్లీ ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పుడు ప్రజల నుంచివస్తున్న అభ్యర్థనల నేపథ్యంలో ఆయన ప్రజాక్షేత్రంలోకి రావాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.