పార్టీని నడపడం చాలా కష్టంగా ఉందని వైసీపీ ముఖ్యనాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం 11 మంది పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల్లో 10 మంది వరకు పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి రాదన్నారు. అందరూ జగన్‌కు విధేయులేనని.. అయితే, ఒకరిద్దరు దారి తప్పినంత మాత్రాన అందరినీ అదే రాటన కట్టవద్దని ఆయన పేర్కొన్నారు. మీడియా సంయమనం పాటించాలని సూచించారు. “ఈ రోజుల్లో రాజకీయ పార్టీని నడిపించడం అంటే తమాషా కాదు. చాలా కష్టంగా ఉంది. ఈ విషయాన్నితెలుసుకోలేక చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు” అని అన్నారు.
రాజకీయాల్లో నాయకులు తాము అనుకున్నట్టుగా అన్నీ జరగాలంటే కుదరదని ఇటీవల రాజ్యసభకు రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయినా.. ఆయనకు ఏం తక్కువ చేశారని.. పార్టీ మారారని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ ఎన్నో కొరికలు ఉంటాయన్నారు. కుదిరితే ముఖ్యమంత్రి కూడా కావాలని అనుకుంటారని.. సాధ్యమవుతుందా? అన్నారు. ఉన్నంతలో అందరికీ జగన్ న్యాయం చేశారని చెప్పారు. మోపిదేవి ఎన్నికల్లో ఓడిపోయినా.. ఎవరూ ఊహించని విధంగా ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి.. అనంతరం మంత్రిని చేశారని చెప్పారు. తర్వాత రాజ్యసభకు కూడా పంపించారన్నా రు.
ఇప్పుడు సొంత అవసరాలు, ఇబ్బందులు ఉన్నాయని పార్టీ మారడం సరికాదన్నారు. ఇలాంటి వారికి ప్రజల్లోను, రాజకీయాల్లో నూ ఏమాత్రం విలువ ఉండదని రామిరెడ్డి చెప్పారు. ఇక, తనపై వస్తున్న వార్తలను కూడా ఆయన ప్రస్తావించారు. తను ఎప్పటికీ పార్టీ మారేది లేదన్నారు. అంతేకాదు.. రాజ్యసభ కు రాజీనామా చేయనని, జగన్ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయబోన న్నారు. చివరి వరకు జగన్‌తోనే నడుస్తానని తేల్చి చెప్పారు. ఆ ఇద్దరు(మోపిదేవి, బీద మస్తాన్) మినహా అందరూ.. జగన్‌తోనే ఉంటారని చెప్పారు. ఈ విషయంలో మీడియా సంయమనం పాటించాలన్నారు.
నేనూ మారను: ఆర్. కృష్ణయ్య
బీసీ నాయకుడు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కూడా వైసీపీని వీడి బీజేపీలోకి చేరనున్నారన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారబోనన్నారు. జగన్ వెంటే నడుస్తానని చెప్పారు. బీసీల కోసం పార్లమెంటులో గళం వినిపించాలని తనను జగన్ పార్లమెంటుకు పంపించారని.. ఇప్పుడు ఆయనకు ద్రోహం చేస్తానా? అలా చేస్తే.. బీసీలకు చేసినట్టేకదా? అని ప్రశ్నించారు. అవసరాలు, సమస్యలు ఉన్నవారే పార్టీలు మారుతారని.. తనకు అలాంటివి ఏమీ లేవన్నారు. జగన్ ఇచ్చిన అవకాశం వినియోగించుకుని బీసీలకు మేలు చేసే పనిపైనే ఉంటానన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates