ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ప్రపంచ బ్యాంకు.. అమరావతికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అమరావతి అభివృద్ధి ఒక అద్భుత అవకాశమ ని తెలిపింది. రాబోయే 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుంటే.. ఈ నగరం అత్యద్భుతంగా ఉంటుం దని.. ఒక్క ఏపీకే కాకుండా.. భారత దేశానికి కూడా ఈ నగరం ఎంతో తలమానికమని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఇలాంటి నగరానికి సాయం చేసే అవకాశం లభించినందుకు హ్యాపీగా ఉందని తెలిపింది.
“రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం మాత్రమే కాదు, సాంకేతిక మద్దతు ను కూడా అందిస్తాం. ఎలాంటి వాతావరణానికైనా తట్టుకుని, ఆర్థికంగా సుస్థిరం కాగలిగిన ఒక గ్రీన్ ఫీల్డ్ నగరాన్ని అభివృద్ధి చేయడం దేశంలో ఆర్థిక ప్రగతి పుంజుకునేందుకు కారణమవుతుంది. ఇది మాకు కూడా గర్వకారణం” అని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ప్రాంత అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ లో అమరావతికి రూ.15 వేల కోట్లు ఇప్పిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు కలిసి రూ.15 వేల కోట్లను రుణ రూపం లో అందిస్తున్నాయి. ఈ క్రమంలో గత వారంలో ఇరు బ్యాంకులకు చెందిన ప్రతినిధులు అమరావతిలో పర్యటించారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న నవనగరాలతో పాటు.. రాజధానిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అమలు అవుతున్న ఇతర నగరాల ప్రాజెక్టుల అనుభవాన్ని, నైపుణ్యాన్ని అమరావతి నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు ఉపయోగించుకోనున్నాయి.
అమరావతి రాజధాని నిర్మాణం వల్ల లభించే పాఠాలు దేశమంతటా ఇతర మునిసిపల్ అభివృద్ధి పథకాల రూపకల్పన చేసేందుకు మాత్రమే కాక ప్రస్తుత ప్రాజెక్టుల మెరుగుదలకు తోడ్పడతాయన్నది ప్రపంచ బ్యాంకు ఉద్దేశం. ప్రస్తుతం జరిపింది.. ప్రాథమిక అంచనానేనని… మరికొన్ని సార్లు పర్యటించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించి సమగ్రమైన ఒక నిర్ణయానికి రానున్నట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇతర భాగస్వాములు, స్థానిక ప్రజలతో కూడా తాము చర్చిస్తామని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఏదేమైనా.. ప్రపంచ స్థాయి నగరాల్లో అమరావతి గొప్పగా నిలిచిపోతుందన్నది ప్రపంచ బ్యాంకు కామెంట్.
Gulte Telugu Telugu Political and Movie News Updates