కొట్టు సత్యనారాయణ. వైసీపీ ప్రభుత్వంలో జగన్ క్యాబినెట్ లో దేవాదాయ, ధర్మాదాయ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1994 నుండి రాజకీయాల్లో ఉన్న ఆయన 2004, 2019లలో రెండు సార్లు మాత్రమే గెలిచాడు. ఇటీవల ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుండి వైసీపీ తరపున పోటీ చేసి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ చేతిలో 62492 ఓట్ల తేడాతో భారీ పరాజయం మూటగట్టుకున్నాడు.
అధికారంలో ఉన్నప్పుడు ఆయన అసలు పార్టీ కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోలేదని వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెల్తువెత్తాయి. దీంతో తాడేపల్లి గూడెం వైసీపీ ఇంఛార్జ్ పదవి నుండి కొట్టు సత్యనారాయణను తొలగిస్తారని ప్రచారం జరుగుతుంది. తాడేపల్లిగూడెం కాపు సామాజిక వర్గానికి కంచుకోట ఈ నేపథ్యంలో అక్కడ కాపు నేతనే వైసీపీ ఇంఛార్జ్ గా నియమిస్తారని ప్రచారం జరుగుతున్నది.
దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా రెండున్నరేళ్లు పనిచేసిన కొట్టు సత్యనారాయణ ప్రజలకు అందుబాటులో లేరని, నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని, అవినీతి కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా కోటరీని ఏర్పాటు చేసుకున్నారని, కార్యకర్తలను, నేతలను నోటికి వచ్చినట్లు తిట్టేవాడని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెం వైసీపీ ఇంచార్జ్‌గా ఏపీ ఆక్వా డెవలప్ మెంట్ వైస్ చైర్మన్ గా పనిచేసిన వడ్డీ రఘురామ్‌ను నియమించనున్నారని అంటున్నారు.
ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత ఐ ప్యాక్ టీమ్ కారణంగానే ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని, కొందరు పార్టీ పెద్దలు వ్యవహరించిన తీరు కూడా కారణమని కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. అయితే ప్రస్తుతం పార్టీ బాధ్యతల నుండి తప్పిస్తే కొట్టు సత్యనారాయణ వైసీపీలోనే కొనసాగుతారా ? లేక పార్టీ మారతారా ? అన్న చర్చ జరుగుతుండడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates