అధికారం పోయినా.. అహంకారం పోలే: రేవంత్

బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ప్ర‌స్తుత ఎమ్మెల్యే కేటీఆర్‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారం పోయినా.. అహంకారం పోలేదని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం స‌చివాల‌యం వ‌ద్ద దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్‌గాంధీ విగ్ర‌హం పెడితే.. తాము అధికారం చేప‌ట్టాక దానిని తొల‌గిస్తామ‌ని.. సోమ‌వారం.. కేటీఆర్ వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా రాజీవ్ గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

అధికారం పోయినా.. అహంకారం మాత్రం పోలేద‌న్నారు. త‌మ‌పై లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తే.. తెలంగాణ ప్ర‌జ‌లే స‌హించ‌బోర‌ని రేవంత్ హెచ్చ‌రించారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని కూడా స‌చివాల‌యంలో ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. దేశానికి మంచి చేసిన నాయ‌కుల‌ను త‌లుచుకుంటార‌ని.. దోచుకున్న నాయ‌కులు కాద‌ని ప‌రోక్షంగా బీఆర్ ఎస్ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశం కోసం.. రాజీవ్ గాంధీ త‌న ప్రాణాల‌ను అర్పించార‌ని తెలిపారు. గాంధీల కుటుంబందేశం కోసం.. త‌న వారిని కోల్పోయింద‌న్నారు.

అలాంటివారిని జాతి గుర్తు పెట్టుకుంటుంద‌ని తెలిపారు. కానీ, తెలంగాణ పోరాటాన్ని అడ్డు పెట్టుకుని కొంద‌రు లూటీ చేశార‌ని అన్నారు. వారిని ప్ర‌జ‌లు ఎప్పుడో తరిమి కొట్టార‌ని.. ప‌రోక్షంగా పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ప‌రాజ‌యాన్ని ప్ర‌స్తావించారు. రాష్ట్ర అభివృద్దికి తాము నిరంత‌రం కృషి చేస్తున్నామ‌ని.. ఈ విష‌యం తెలిసి కూడా.. కొంద‌రు క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండి ప‌డ్డారు. వారికి ప్ర‌జ‌లే బుద్ధి చెబుతార‌ని వ్యాఖ్యానించారు.

ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు తెలిపారు. కాగా.. రాజీవ్ గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాలు చేశారు. రాజీవ్ విగ్ర‌హాల‌కు పూలమాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. 1944, ఆగ‌స్టు 20న ఇందిర‌, ఫిరోజ్ గాంధీల‌కు జ‌న్మించిన రాజీవ్‌.. దేశ 6వ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.