టీడీపీ అధినేత చంద్రబాబు మానస పుత్రికగా పేర్కొనే అన్న క్యాంటీన్లకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 15న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని, పేదల ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తొలి క్యాంటీన్‌ను ఆయన గుడివాడలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ రోజే ఆయన బ్యాంకు ఖాతా వివరాలను కూడా వెల్లడించారు.
ఇక, ప్రతి ఒక్కరూ కదలి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దీంతో పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు కూడా.. విరాళాల వర్షం కురిపిస్తున్నారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించిన కేవలం ఐదు రోజుల్లోనే(ఈ నెల 15-20 మధ్య) 20 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూరాయి.
ఎవరెవరు.. ఎంతెంత?
- సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తొలి రోజు విరాళం: కోటి రూపాయలు
- మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఇచ్చింది: కోటి రూపాయలు
- టీడీపీ నేత, వ్యాపార వేత్త శిష్టా లోహిత్ విరాళం: కోటి రూపాయలు
- గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు విరాళం: 25 వేలు
- గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ విరాళం: ప్రతి శుక్రవారం నియోజకవర్గంలోని క్యాంటీన్లలో భోజనం ఖర్చు
- ప్రత్తిపాడు ఎమ్మెల్యే బి.రామాంజనేయులు విరాళం: 30 వేలు
- మంత్రి రాంప్రసాద్ రెడ్డి విరాళం: ఒక జీతం రూ.3.3 లక్షలు
- మంత్రి గొట్టిపాటి ఫ్యామిలీ ఇచ్చింది: 50 లక్షలు
- మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విరాళం: 2 లక్షలు
- గెజిటెడ్ ఉద్యోగుల సంఘం: ఒక పూట వేతనం(సుమారు 50 లక్షలు)
- సాధారణ ఉద్యోగుల విరాళం: ఒక రోజు వేతనం
- రాష్ట్ర వ్యాప్తంగా 2 వేలకు పైగా సామాజిక పింఛను దారులు ఇచ్చింది : 3.2 లక్షలు
- ఎన్నారైల నుంచి అందింది: 2 కోట్ల రూపాయలు