రాజకీయాలు మారుతున్నాయి. ఏదీ నిన్నటిలా ఉండే సమస్యేలేదు. తమకు అవకాశం దక్కితే చాలు.. విస్తరించే పనిలో నాయకులు ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా లోని రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్.. మాజీ మంత్రి పరిటాల సునీత దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల నాటికి తన కుమారుడు శ్రీరామ్‌కు ఆమె అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్న దరిమిలా.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
వైసీపీకి చోటు లేకుండా చేయాలన్న వ్యూహంతో పరిటాల సునీత ముందుకు వెళ్తున్నారు. రాప్తాడులో గత 2019 ఎన్నికల్లో విజయం దక్కించుకున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తర్వాత కాలంలో టీడీపీ కార్యకర్తలను, క్షేత్రస్థాయిలో నాయకులను కూడా వైసీపీ వైపు మళ్లించారు. అయినప్పటికీ.. సునీత విజయం సాధించారు. కానీ, ఈ పరిణామాలను అలానే వదిలేయకుండా ఇప్పుడు పాత గూటికి చేరేలా వెళ్లిపోయిన నాయకులను కలుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. నేరుగా వారిని కలుస్తున్నారు.
పార్టీ లోకి తిరిగి ఆహ్వానిస్తున్నారు. ఇక, మరోవైపు ప్రజలకు చేరువయ్యేందుకు సునీతే కదిలి వెళ్తున్నారు. ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. వారి కష్టాలను పంచుకుంటున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు కూడా వైసీపీకి అనుకూలంగా కుటుంబాలు ఇప్పుడు సునీత వెంట వస్తున్నాయి. వైసీపీ జెండా మోసిన కార్యకర్తలు కూడా.. ఇప్పుడు టీడీపీ జెండా పట్టుకుని సునీతకు జేజేలు కొడుతు న్నారు. దీంతో పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది.
వైసీపీలో ఉండే కన్నా.. టీడీపీలో ఉంటే బెటర్ అనుకునే పరిస్థితిని ఆమె కల్పించారు. వచ్చే ఎన్నికల నాటికి శత్రువు అనే మాట వినిపించకుండా.. తనదైన శైలిలో సునీత దూకుడు చూపించడంతో రాప్తాడు గ్రామీణ రాజకీయం కూడా తమకు అనుకూలంగా మారుతోందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా సునీతే తరలి వెళ్లడం.. వారి కష్టాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో సునీత గ్రాఫ్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుండడం గమనార్హం.