నెమ్మదించిన కోటంరెడ్డి !

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్. వైసీపీ నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ రెడ్డి శాసనమండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డాడని వైసీపీ పార్టీ నుండి బహిష్కరించింది. అయితే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని కోటంరెడ్డి ఆరోపించారు. ఇటీవల్ల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వరసగా మూడో సారి నెల్లూరు రూరల్ శాసనసభ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

వైసీపీలో ఉన్నప్పుడు, వైసీపీ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా కోటంరెడ్డి సవాళ్లు విసురుతూ ఫైర్ బ్రాండ్ గా పేరుపొందాడు. అయితే తన స్వభావానికి భిన్నంగా గత కొంతకాలంగా శాంతికాముకుడిగా మారిపోయాడు. టీడీపీ తరపున గెలిచిన తర్వాత వైసీపీ నేతల ఇళ్ల ముందు కార్యకర్తలు రెచ్చగొడుతూ ఫ్లెక్సీలు పెట్టారు.

విషయం తెలుసుకున్న కోటంరెడ్డి వెంటనే ప్రత్యర్ధుల ఇళ్ల ముందు ఫ్లెక్సీలు తొలగించాలని టీడీపీ కార్యకర్తలకు సూచించాడు. తన మాటను గౌరవించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పడంతో కార్యకర్తలు ఆ ఫ్లెక్సీలను తొలగించారు. ఫైర్ బ్రాండ్ లా ఉండే కోటంరెడ్డి హఠాత్తుగా రూటు మార్చాడేంటని సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు ఆశ్చర్య పోతున్నారు.

 గ్రావెల్, ఇసుక దందాలకు పాల్పడుతూ దొరికితే టీడీపీ వారైతే రూ.లక్ష జరిమానా వేయాలని, వైసీపీ వారైతే రూ.2 లక్షలు జరిమానా వేయాలని,  తన పేరు చెప్పుకుని ఎవరైనా ఈ దందా చేస్తుంటే రూ.10 లక్షల జరిమానా విధించాలని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. కోటంరెడ్డి ఫోన్ వస్తేనే వణికిపోయే అధికారులు ప్రస్తుతం ఆయనలో వచ్చిన మార్సు చూసి అసలు ఈ మార్పుకు కారణం ఏంటా ? అని ఆరాలు తీస్తున్నారట.