వైసీపీ అధినేత, ఏపీ విపక్ష నాయకుడు జగన్‌ను కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు తగులుకున్నారు. ఎన్నికల సమయంలోనూ జగన్‌పై విరుచుకుపడ్డ ఆయన ఇప్పుడు మరోసారి మాటల తూటాలు పేల్చారు. జగన్‌కు రాజకీయాల్లో ఓనమాలు తెలియవని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ కోరడమేంటని.. దీనిని బట్టే ఆయన రాజకీయ పరిపక్వతను అర్ధం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఈ మాటలు విని జనం నవ్వుకుంటున్నారని అన్నారు.
జగన్ కోరికలు కూడా ఆయనలానే చిత్రంగా ఉన్నాయని గోనె అన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరడం.. ఎవరైనా ఇచ్చిన సలహానా.. లేక ఆయనకే వచ్చిన ఐడియానా? అని వ్యాఖ్యానించారు. ఎలా చూసుకున్నా.. పట్టుమని మూడు వారాలు కూడా నిండని ప్రభుత్వాన్ని తోసేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, రాష్ట్రపతి పాలన అసాధ్యమని వ్యాఖ్యానించారు. “జగన్ డిమాండ్ చేయడం చూస్తుంటే రాజకీయాల్లో ఆయనకు ఓనమాలు తెలియవని స్పష్టం అవుతోంది” అని గోనె అన్నారు.
ఇక, దివంగత వైఎస్ గురించి మాట్లాడుతూ.. వైఎస్‌ను తాను దేవుడితో సమానంగా భావిస్తానని, ఇప్పటికీ తన ఇంట్లో వైఎస్ ఫొటో ఉంటుందని తెలిపారు. కానీ, ఆయన కుమారుడిగా జగన్ నవ్వుల పాలవుతున్నారని, దీంతో వైఎస్‌ను కూడా చులకనగా చూసే పరిస్థితి వచ్చిందని గోనె వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతోమాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు పాలన ఇప్పుడే ప్రారంభమైందని.. ఇంతలోనే ఏదో ఊహించేసుకుని.. ఆరోపణలు చేయడం సరికాదని గోనె అన్నారు. ఇటీవల తాను చంద్రబాబును మర్యాద పూర్వకంగానే కలిసినట్టు చెప్పారు.
తనకు రాజకీయంగా ఎలాంటి ఆశలు లేవన్న గోనె..వీటిని ఎప్పుడో వదిలేశానని చెప్పారు. ప్రస్తుతం తాను ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నానని చెప్పారు. తుది శ్వాస వరకు అక్కడే ఉంటానన్నారు. కాగా, వైఎస్ హయాంలో గోనె ప్రకాష్‌రావు.. ఓ వెలుగు వెలిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. దీనికి ముందు ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. అయితే.. జగన్‌తోనూ తొలినాళ్లలో బాగానే ఉన్నా..తర్వాత వీరిద్దరి మధ్య చెడిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి జగన్‌ను కార్నర్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అదేసమయంలో షర్మిలకు మద్దతుగా మాట్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates