ఏపీలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయంతో అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరాలన్న ఆశావాహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో చీరాల నియోజకవర్గం నుండి చేరాలన్న నాయకుల ప్రయత్నాలు అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. ఈ నాయకులలో ఎవరికి టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూడడం గమనార్హం.
2014 ఎన్నికల్లో చీరాల నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత టీడీపీలో చేరాడు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాడు. ఆ ఎన్నికల్లో కరణం బలరాం చేతిలో ఓటమి చవిచూశాడు. ఇటీవల ఎన్నికలకు ముందు వైసీపీని వీడిన ఆమంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి 41295 ఓట్లు సాధించాడు.
నాలుగు దశాబ్దాలుగా టీడీపీతో అనుబంధం ఉన్న కరణం బలరాం గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరాడు. ఈ ఎన్నికల్లో ఆయన తన కుమారుడికి వైసీపీ టికెట్ ఇప్పించకున్నా గెలిపించుకోలేకపోయాడు. 50802 ఓట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక్కడ టీడీపీ తరపున చివరి నిమిషంలో సీటు దక్కించుకున్న మాలకొండయ్య 71360 ఓట్లు సాధించి విజయం సాధించాడు.
ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అధికారపార్టీలో చేరేందుకు సుజనా చౌదరి ద్వారా కరణం బలరాం, మంత్రి గొట్టిపాటి రవికుమార్ ద్వారా ఆమంచి కృష్ణమోహన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీతో ఉన్న అనుబంధంతో కరణం, నియోజకవర్గంలో ఉన్న పట్టును చూపుతూ ఆమంచి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరి వీరిద్దరిలో చంద్రబాబు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ? అన్నది వేచిచూడాలి.
ఇదే సమయయంలో వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా టీడీపీలో చేరికకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. 2014లో ఇక్కడి నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ పోతుల సునీత పరిటాల రవి అనుచరుడు పోతుల సురేష్ సతీమణి. తెలంగాణలోని అలంపూర్ జడ్పీటీసీగా గెలిచిన ఆమె ఆ తర్వాత అలంపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది.
ఆ తర్వాత పెనుగొండ, అనంతపురం, అలంపూర్ నియోజకవర్గాలలో టీడీపీ టికెట్ ఆశించినా దక్కలేదు. 2014 ఎన్నికల్లో చీరాల నుండి అవకాశం వచ్చినా ఓడిపోయింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై జరిగిన ఓటింగ్‌లో టీడీపీ విప్‌కు వ్యతిరేంకగా ఓటు వేసి వైసీపీకి మద్దతు తెలిపి ఆ తర్వాత ఆ పార్టీలో చేరిపోయింది. ప్రస్తుతం శాసనమండలిలో టీడీపీకి తగినంత మంది సభ్యుల బలం లేని నేపథ్యంలో ఆమెను చేర్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates