కొన్నాళ్లుగా చర్చకు దారి తీసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసు కున్నట్టు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బోర్డు మొత్తం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో నూతన బోర్డును ఎంపిక చేయాల్సి వచ్చింది.
ఈ క్రమంలో సభ్యుల మాట ఎలా ఉన్నా.. చైర్మన్ పదవికి మాత్రం నలుగురు కీలక వ్యక్తులు పోటీలో నిలిచారు. వీరిలో సినీ రంగానికి చెందిన దిగ్గజ దర్శక, నిర్మాతలు కూడా ఉన్నారు. అయితే.. వీరందరినీ కాదని.. ఓ టీవీ అధినేత కు చంద్రబాబు మొగ్గు చూపారని తెలిసింది. ఆయన పేరును దాదాపు ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలుచెబుతున్నాయి.
ఒకటి రెండు రోజుల్లోనే పూర్తిస్థాయిలో బోర్డును ఎంపిక చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలన నుంచి కూడా సమాచారం. వాస్తవానికి గతంలో పార్టీ తరఫున చెదలవాడ కృష్ణమూర్తి బోర్డు చైర్మన్‌గా చేశారు. 2019 ఎన్నికలకు ముందు పుట్టా సుధాకర్ యాదవ్‌ను చైర్మన్ పోస్టుకు ఎంపిక చేశారు.
ఆయన తర్వాత.. బోర్డు మొత్తం వైసీపీ పరిధిలోకి వెళ్లిపోయింది. ఇక, ఇప్పుడు కూటమి ప్రభు త్వం ఏర్పడిన దరిమిలా.. రెండు మాసాల నుంచి బోర్డుపై కసరత్తు జరుగుతూనే ఉంది. చైర్మన్ పదవి విషయంలో నలుగురు పోటీ పడడంతో దీనికి ఎంపిక చేయడం సీఎం చంద్రబాబుకు సవాల్‌గా మారింది.
దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత సీ. అశ్వనీదత్ సహా ప్రముఖ నటుడు మురళీ మోహన్ వంటి వారుచైర్మన్ పోస్టుకు పోటీ పడ్డారు. వీరితోపాటు పిఠాపురం టికెట్ ను త్యాగం చేసిన వర్మ కూడా బరిలో ఉన్నారని.. కొన్నాళ్లు ప్రచారంలోకి వచ్చింది.
వీరికంటే ఎక్కువగా గత కొన్నాళ్ల నుంచి టీవీ5 అధినేత బీఆర్ నాయుడు పేరును కూడా పార్టీ వర్గాలు ప్రస్తావించాయి. ఎట్టకేలకు నాయుడు వైపు చంద్రబాబు మొగ్గు చూపినట్టు తాజా సమాచారం. ఆయన పేరును ఖరారు చేశారని తెలిసింది. ఇక, బోర్డు సభ్యల్లో నాలుగు రాష్ట్రాలకు చెందిన వారు పోటీలో ఉన్నారు.
తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ సహా ఢిల్లీకి చెందిన వారు కూడా.. బోర్డు సభ్యులుగా పోటీ పడుతున్నారు. వీరి సంఖ్య సుమారు 100కుపైగానే ఉందని తెలిసింది. అయితే.. బోర్డులో 32 మందికి మాత్రమే అవకాశం ఉంది. గతంలో జగన్ 55 మంది సభ్యులను ఎంపిక చేసి.. కోర్టు నుంచి తిట్లు తిన్న పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బోర్డు సంఖ్యకు అనుగుణంగా 32 మందినే ఎంపిక చేయాలని.. ఎక్స్ అఫిషియో, అఫిషియో సభ్యులను తర్వాత ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమచారం. ప్రస్తుతం బోర్డు సభ్యుల ఎంపిక కూడా పూర్తయిందని.. త్వరలోనే ప్రకటన రానుందని తెలుస్తోంది.