జగన్ టార్గెట్ చేసిన రమణ దీక్షితులకు కోర్టులో ఊరట

టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు పేరు ఇరు తెలుగు రాష్ట్రాలలో సుపరిచితమే. తన వ్యాఖ్యలతో రమణ దీక్షితులు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం రమణదీక్షితులను టీటీడీ ప్రధాన అర్చకుడి బాధ్యతలు నుంచి హఠాత్తుగా తప్పించింది. జగన్ ప్రభుత్వం పైనే ఆయన విమర్శలు చేయడంతో ఆయనపై వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే తనకు బాధ్యతలు తిరిగి అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రమణ దీక్షితులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా, ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు రమణ దీక్షితులుకు ఊరటనిచ్చింది.

ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి, టిటిడి ఈవోకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ వ్యవహారంపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీంతో, గత ప్రభుత్వానికి చుక్కెదురై రమణ దీక్షితులకు ఊరట లభించినట్లయింది. టీటీడీలో వంశపారంపర్యంగా అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి ఆనాటి టిడిపి ప్రభుత్వం పదవి విరమణ వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రమణ దీక్షితులతో పాటు కొందరు హైకోర్టును ఆశ్రయించారు.

ఆ తర్వాత వారికి హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ, వయోభారంతో స్వామివారికి కైంకర్య సేవలు ఆయన నిర్వర్తించలేరేమో అన్న కారణంతో ఆనాటి టీడీపీ ప్రభుత్వం రమణ దీక్షితులును టీటీడీ విధుల్లోకి తీసుకోలేదు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రమణ దీక్షితులను ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమించింది. ఆ తర్వాత కొంతకాలం వైసీపీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్న రమణ దీక్షితులు టీటీడీ పాలకమండలితోపాటు ఆనాటి ముఖ్యమంత్రి జగన్ పై కూడా సంచలన విమర్శలు, వ్యాఖ్యలు చేశారు.

దీంతో, 2024 మార్చిలో ఆయనను బాధ్యతల నుంచి తొలగిస్తూ టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించగా తాజాగా ఆయనకు ఊరట కలిగే నిర్ణయం వెలువడింది.