స‌బిత‌క్క.. రేవంత్‌.. అసలు ఏం జరిగింది?

తెలంగాణ అసెంబ్లీలో మాట‌కు మాట ఎలా ఉన్నా.. తాజాగా సెంటిమెంటు.. ఎమోష‌న్లు కూడా పండేశాయి. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌తో తీవ్ర మ‌న‌స్తాపం చెందిన మాజీ మంత్రి స‌బిత ఏకంగా క‌న్నీరు పెట్టేసు కున్నారు. తానే ఏం పాపం చేశానంటూ ప్ర‌శ్నించారు. దీంతో స‌భ‌లో ఒక్క‌సారిగా గంద‌ర‌గోళం ఏర్ప‌డ‌డం.. అదుపు త‌ప్ప‌డంతో స‌భ‌ను స్పీక‌ర్ వాయిదా వేశారు. అనంత‌రం 10 నిమిషాల‌కు స‌భ ప్రారంభ‌మ‌య్యాక సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స‌బిత‌ను ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు.

స‌బిత‌క్క కంట‌త‌డి పెట్టుడేంది? అన్నారు. ప్ర‌జాజీవితంలో ఉన్న‌ప్పుడు చ‌ర్చ‌లు లేకుండా ఉంటా యా? అని అనున‌యించే ప్ర‌య‌త్నం చేశారు. ఇదేస‌మ‌యంలో తాను చెప్పాల‌ని అనుకున్న వాటిని చెప్పేశారు. త‌మ మ‌ధ్య గ‌తంలో జ‌రిగిన విష‌యాల‌ను స‌బిత చెప్పార‌ని.. కాబ‌ట్టి.. నేను కూడా కొన్ని విష‌యాలు చెప్పాల్సి వ‌స్తోంద‌ని అన్నారు. న‌న్ను స‌బిత‌క్క మోసం చేసింది. న‌న్ను కాంగ్రెస్‌లోకి ర‌మ్మ‌నింది ఆమెనే. మ‌ల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయ‌మ‌ని చెప్పింది ఆమెనే. కానీ, ఆమె మాత్రం బీఆర్ ఎస్‌లోకి వెళ్లిపోయింది ఇది మోసం కాదా అని వ్యాఖ్యానించారు.

న‌న్ను మోసం చేసింది కాబ‌ట్టే స‌బిత‌క్క‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కేటీఆర్ సూచించాన‌ని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. న‌న్ను పార్టీలోకి పిలుచుడెందుకు.. నువ్వు పోవుడెందుకు? న‌న్ను మోసం చేయాల‌నే క‌దా? కాదా.. ఈ విష‌యం స‌బిత‌క్క గుండెల‌పై చేయి వేసుకుని చెప్పాలి. అని రేవంత్ వ్యాఖ్యానించా రు. ఈ స‌మ‌యంలోనూ స‌బిత మౌనంగా ఉన్నారు. ఇక‌, సీఎం వ్యాఖ్య‌లు ముగియ‌గానే .. స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. స‌భ‌లో రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నారంటూ.. కేటీఆర్‌ను గ‌ద్దించారు. ఇది స‌భా సంప్ర‌దాయం కాద‌న్నారు.

కాగా.. స‌బిత క‌న్నీళ్ల వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నాయ‌కులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయ‌కులు మ‌హిళ‌ల‌ను ఏడిపించ‌డ‌మే తెలుసునంటూ.. స‌భ‌కు వెలుపల ప‌లువురు నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని అనుకుంటున్నామ‌ని.. కానీ, స‌భ‌లో కూడా రక్ష‌ణ లేద‌ని కొంద‌రు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏదేమైనా చిన్న కార‌ణానికి స‌బిత క‌న్నీరు పెట్టుకోవ‌డం.. స‌భ‌లో కొంత దుమారం రేపింది.