పోల‌వ‌రానికి అదే శాపం.. పాపం: కేంద్రం తాజా అప్‌డేట్

ఏపీ ప్ర‌జ‌ల జ‌ల జీవ‌నాడి పోల‌వ‌రం ప్రాజెక్టుపై కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా స్పందించింది. దీనికి సంబంధించి ప‌లు వివ‌రాల‌ను లిఖిత పూర్వ‌కంగా వెల్ల‌డించింది. పోల‌వ‌రం ప్రాజెక్టు ఊహించ‌ని విధంగా ఆలస్యమైన‌ విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు ఆల‌స్య‌మైంద‌న్న ప్ర‌శ్న‌కు గ‌త వైసీపీ ప్ర‌భుత్వం కానీ.. గ‌త మోడీ స‌ర్కారు కానీ.. స‌మాధానం చెప్ప‌లేదు. అయితే.. తాజాగా ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రావ‌డం.. పోల‌వ‌రం కోసం ప‌ట్టుబ‌ట్ట‌డం.. కేంద్రం కూడా నిర్మాణానికి సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో గురువారం పార్ల‌మెంటులో పోల‌వ‌రంపై ఏపీకి చెందిన ప‌లువురు ఎంపీలు ప్ర‌శ్న‌లు సంధించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ లిఖిత పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చింది. ఆల‌స్యానికి కార‌ణం.. 2019-20 మ‌ధ్య పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాల‌ను చూస్తున్న న‌వ‌యుగ కాంట్రాక్ట‌ర్ సంస్థ‌ను త‌ప్పించ‌డ‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. ఈ కాంట్రాక్టును ర‌ద్దు చేయ‌వ‌ద్ద‌ని తాము సూచించిన‌ట్టు పేర్కొంది. అయిన‌ప్ప‌టికీ.. అప్ప‌టి ప్ర‌భుత్వం కాంట్రాక్టును ర‌ద్దు చేసింద‌ని.. దీంతో ఆల‌స్య‌మైంద‌ని తెలిపింది.

ఇక‌, పోల‌వ‌రం నిర్మాణానికి విడ‌తల వారీగా ఇచ్చిన నిధుల వివ‌రాల‌ను కూడా కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. 8 వేల 44 కోట్ల రూపాయ‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన‌ట్టు తెలిపింది. కొన్ని ప‌ద్దుల‌కు త‌మ‌కు బిల్లులు రావాల్సి ఉంద‌ని పేర్కొంది. గ‌త మూడేళ్ల‌లో ఇచ్చిన నిధుల‌ను స‌క్ర‌మంగానే అమ‌లు చేసిన‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపిన‌ట్టు చెప్పింది. అదేవిధంగా గ‌త మూడేళ్ల‌లో కాంక్రీటు ప‌నులు 5 శాతం మేర‌కు జ‌రిగాయ‌ని.. వివ‌రించింది.

అదేవిధంగా.. పోల‌వ‌రం ప్రాజెక్టు తొలి ద‌శ ప‌నుల‌ను 2026 మార్చి నాటికి పూర్తి చేయ‌నున్న‌ట్టు కేంద్రం వెల్ల‌డించింది. అయితే.. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్త‌వుతుంద‌నే వివ‌రాలు వెల్ల‌డించేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని ప్ర‌స్తుతం ప్రాజెక్టు ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా(నాన్ కాన్షియ‌స్‌నెస్‌) ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం వివ‌రించింది. అయిన‌ప్ప‌టికీ.. ప‌నులు చేసేందుకు కేంద్రం క‌ట్టుబ‌డి ఉంద‌ని తెలిపింది.