పోలీసులకు ఝలక్ ఇచ్చిన కడప రెడ్డెమ్మ

కనీస సమాచారం ఇవ్వకుండా తనకున్న టు ప్లస్ టు గన్ మెన్లను ఒన్ ప్లస్ వన్ కు కుదించారు. తన భర్తకు ఉన్న వన్ ప్లస్ వన్ సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. దీంతో తనకు అసలు సెక్యూరిటీనే అవసరం లేదు అంటూ ఆ ఎమ్మెల్యే తిప్పిపంపిది. సెక్యూరిటీ కుదిస్తూ పోలీసు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం కడప రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కడప శాసనసభ స్థానం నుండి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి సతీమణి, ఫైర్ బ్రాండ్ రెడ్డప్పగారి మాధవిరెడ్డి ఇటీవల ఎన్నికల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ అభ్యర్థి అంజాద్ భాషాపై 18 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికలకు ముందు ప్రత్యర్ధి పార్టీ అభ్యర్థి తమ్ముడి నుండి తనకు ప్రాణహాని ఉందని పోలీసులను కోరడంతో మాధవిరెడ్డి, ఆమె శ్రీనివాసులు రెడ్డికి సెక్యూరిటీని కేటాయించారు.

తాజాగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గన్ మెన్లను తొలగించడంతో ఆమె మనస్తాపానికి గురై మొత్తానికే సెక్యూరిటీ అవసరం లేదంటూ తిప్పి పంపి శాసనసభ సమావేశాలకు హాజరవుతుండడం కలకలం రేపుతుంది. జగన్ సొంత ఇలాకా అయిన కడపలో మాధవిరెడ్డి విజయం సంచలనంగా మారింది. ఈ విషయంలో పోలీసులు ఎలా స్పందిస్తారు అన్నది వేచిచూడాలి.