వైసీపీ అధినేత, విపక్ష నాయకుడు జగన్.. అసెంబ్లీలో చక్కటి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదన్న అక్కసుతో మంగళవారం సభ మొహం కూడా ఆయన చూడలేదు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వెళ్లినా.. ఆ వెంటనే బయటకు వచ్చేశారు. అయితే.. వాస్తవానికి మంగళవారం కనుక జగన్ కానీ, ఇతర వైసీపీ సభ్యులు కానీ.. సభలో ఉండి ఉంటే.. వారికి మాట్లాడేందుకు అవకాశం దక్కేది. ఎలాటంటే.. మంగళవారం.. సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించారు. సోమవారం నాటి సభ ప్రారంభం అయిన తర్వాత.. ఉభయ సభల(మండలి-శాసన సభ)ను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
ఈ నేపథ్యంలో మంగళవారం.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా అధికార పక్షం తరఫున.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ప్రసంగించారు. అనంతరం.. హోదా ఉన్నా.. లేకున్నా విపక్ష నాయకుడిగా కాకపోయినా.. మాజీ ముఖ్యమంత్రిగా అయినా.. జగన్‌కు మాట్లాడే అవకాశం వచ్చి ఉండేదని.. టీడీపీ నాయకులు పలువురు వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారం చూసుకున్నా.. అధికార పక్షంలో సభ్యులు అయినా.. కాకపోయినా.. ప్రతిపక్షానికి ఖచ్చితంగా సమయం ఇచ్చిన తర్వాతే.. వారు మాట్లాడిన తర్వాతే.. సభను వాయిదా వేయాల్సి ఉంటుంది.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విపక్షానికి అవకాశం ఇవ్వకపోతే.. అది సభా సంప్రదాయాలకే విరుద్ధం కాబట్టి.. ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా జగన్ కు ఛాన్స్ వచ్చి ఉండేదని టీడీపీ సభ్యులు సహా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా అభిప్రాయపడ్డారు. కానీ, జగన్ అసలు సభకు కూడా వెళ్లలేదు. బుధవారం ఆయన ఢిల్లీలో చేయ తలపెట్టిన.. ధర్నా కోసం.. మంగళవారం మధ్యాహ్నమే తాడేపల్లి నుంచి వెళ్లిపోయారు. ఆయన వెంట కొందరు ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు. మరికొందరు రాత్రికి వెళ్లారు. మొత్తంగా చూస్తే.. ఒక చక్కటి అవకాశం అయితే.. జగన్ మిస్ చేసుకున్నారని సభలో చర్చ జరగడం గమనార్హం.