ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో పరిశీలిస్తూనే మరోవైపు క్షణక్షణం తెలంగాణలో పరిస్థితులను సమీక్షిస్తున్న కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోను ఇతర పెద్ద రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ నుంచి కరోనా తరిమేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని సమర్థతను చాటుకుంటే భవిష్యత్తులో ఇన్వెస్టర్లు తమ వైపు చూస్తారన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర ప్రణాళిక రచిస్తున్నారు. అయితే, అనుకోని విధంగా ఆయన ఆలోచనకు ఆయన పార్టీ నేతే గండి కొట్టే ప్రయత్నం అప్రయత్నంగా చేశారు.
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైటెక్ కన్వెన్షన్ సెంటర్లో కూరగాయలు, సరుకులు పంచుతున్నట్టు ప్రకటించారు. అయితే… ఆ పంపిణీ లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా జరపాల్సిన ప్లానింగ్ మాత్రం పట్టించుకోలేదు. బహుశా అందరికీ ఇస్తాం కాబట్టి ప్రజలు లైన్లో వస్తారనే భావనతో, అవగాహనతో ఉన్నారనుకున్నారో ఏమో ఆ ఏర్పాట్లేమీ చేయకుండా పెద్ద ఎత్తున కూరగాయలను, సరుకులను వాహనాల్లో అక్కడికి తెచ్చారు.
ఈ క్రమంలో పేదలు తమకు దక్కుతాయో లేదో అన్న ఆందోళనతో ఎగబడ్డారు. ఈ క్రమంలో గందరగోళానికి దారితీసింది. పెద్ద ఎత్తున జనం గుమిగూడి తోసుకుంటూ వాటికోసం చేతులు చేశారు. అప్పుడు కూడా దీనిని గమనించి తగిన ఏర్పాట్లు చేయకుండా వాహనాల నుంచే సరుకులను విసరడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సామాజిక దూరం అనేదే జీరో అయిపోయింది. అసలే హైదరాబాదులో కరోనా బలంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి పని ఏ ప్రమాదానికి దారితీస్తుందో అని ఆందోళన చెందే పరిస్థితి. ఇన్నాళ్లు ఏపీలో కనిపించిన సీను ఇపుడు హైదరాబాదులో కనిపించి జనాల్ని ఉలిక్కిపడేలా చేసింది. అధినేతతో ఎంపీకి ఈరోజు చీవాట్లు తప్పేలా లేవు. ఇక నుంచైనా ఇవి జరగకుండా చూసుకోవడం ఆయా నాయకుల బాధ్యత.
Gulte Telugu Telugu Political and Movie News Updates